లైట్లు ఆర్పితే ప్రమాదమన్న మంత్రి.. తోసిపుచ్చిన తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ  - MicTv.in - Telugu News
mictv telugu

లైట్లు ఆర్పితే ప్రమాదమన్న మంత్రి.. తోసిపుచ్చిన తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ 

April 4, 2020

Telangana Trans Co CMD dismissed by the Minister who threatened to turn off the lights

కరోనాపై పోరాడుతున్న దేశ స్ఫూర్తిని చాటుతూ ఆదివారం(రేపు) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్ చేసి, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ ఖండించారు. కరోనా ప్రబలుతున్న సమయంలో ఇలాంటి చర్యకు పూనుకోవడం సాధారణ విషయం కాదని.. పవర్ గ్రిడ్ కుప్పకూలి ఎమర్జెన్సీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అని అన్నారు. లైట్లను స్విచ్ఛాఫ్‌ చేయకుండానే దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలని ప్రజలను కోరుతున్నామని వెల్లడించారు. అయితే ఒకేసారి లైట్లు స్విచ్ఛాఫ్‌ చేయడం వల్ల పవర్‌గ్రిడ్‌ కుప్పకూలుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఈ విషయమై సీఎండీ ప్రభాకరరావు ఓ టీవీ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ.. అటువంటి సమస్య ఏమీ ఉండదని భరోసా ఇచ్చారు. కరోనా కట్టడి కోసం మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని, కరోనాపై మనం విజయం సాధించాలని తెలిపారు. తెలంగాణ వరకు గ్రిడ్‌కు ఎటువంటి సమస్య లేకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాం అని చెప్పారు.

మరోవైపు కొన్ని విద్యుత్‌ ఇంజనీర్ల సంఘాలు ఇప్పటికే ఈ విషయమై ప్రధాని కార్యాలయానికి లేఖ పంపినట్లు సమాచారం. ‘అందరూ లైట్లు ఒకేసారి ఆఫ్‌ చేస్తే విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇలా విద్యుత్‌ వినియోగం ఒకేసారి పెరిగిపోయినా, లేదా బాగా తగ్గిపోయినా గ్రిడ్‌ పనిచేయడం నిలిచిపోతుంది. విద్యుత్‌ వినియోగంలో 40 శాతం ఒకేసారి తగ్గిపోతే గ్రిడ్‌ కుప్పకూలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మేము చర్చలు జరిపాం’ అని ఏపీ విద్యుత్‌ ఇంజనీర్ల సంఘం నేత వేదవ్యాస్‌ అన్నారు.