ఖమ్మం బాలిక అంత్యక్రియలు హడావుడిగా.. రూ. 2 లక్షలు చెక్కు...  - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మం బాలిక అంత్యక్రియలు హడావుడిగా.. రూ. 2 లక్షలు చెక్కు… 

October 16, 2020

Telangana tribal girl, set on fire for resisting incident, no more in hospital

ఖమ్మంలో ఓ ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ బాలిక కేసు యూపీలో జరిగిన హత్రాస్ ఘటనను తలిపిస్తోంది. బాలిక అంత్యక్రియలు ముగిశాయి. అయితే పోలీసులు అంత్యక్రియల్లో హడావిడి చేశారని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలిక చికిత్స పొందుతూ 27 రోజుల తర్వాత మృతిచెందిన విషయం తెలిసిందే. బాధిత బాలిక మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించిన అరగంటకే అధికారులు అంత్యక్రియలు జరిపారు. బాలిక మృతదేహాన్ని చూసి బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గ్రామస్తులంతా విషాధంలో మునిగి పోయారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి , కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ తదితరులు బాలిక మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వం తరుఫున రూ.2 లక్షల చెక్‌ను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. బాలిక కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి.. బాలిక తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. కాగా, ఖమ్మం రూరల్‌ మండలం పల్లగూడేనికి చెందిన బాధిత బాలిక ఖమ్మంలోని ఓ ఇంట్లో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆ బాలికకు ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకోగా.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చామని ఇంటి యజమాని సెప్టెంబరు 18న బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఆసుపత్రిలో కొద్దిగా కోలుకున్న బాలిక ఈ నెల 5న తన తల్లికి తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. అప్పుడే ఆమెపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరు 18న ఉదయం 6 గంటలకు బాలిక నిద్రిస్తున్న గదిలోకి వెళ్లిన ఆ ఇంటి యజమాని కుమారుడు అల్లం మారయ్య.. ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు. దీంతో ప్రతిఘటించిన బాలిక అతన్ని దూరంగా నెట్టేసింది. ఆగ్రహంతో ఊగిపోయిన మారయ్య బాలిక మీద  అక్కడున్న పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. మంటల్లో కాలుతూ అరుపులు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.