తెలంగాణ రాష్ట్రంలో ఉబర్ సంస్థ మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర పోలీసులతో సోమవారం ఉబర్ సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం..రాష్ట్రవ్యాప్తంగా ఉబర్ ఇకపై మహిళ ప్రయాణికుల ప్రయాణ విషయంలో మరింత భద్రతను కల్పించనున్నట్లు మహిళా భద్రత విభాగం ఇన్చార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా తెలిపారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉబర్ క్యాబ్‌లో ప్రయాణించే మహళల రక్షణ కోసం, వారికి మరింత భద్రతను కల్పించటం కోసం ఈ ఒప్పందం జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఉబర్ క్యాబ్ సర్వీసులను పోలీస్ ఎమర్జెన్సీ సర్వీసులతోపాటు హాక్ఐ యాప్‌తో అనుసంధానించామని, దీంతో ఊబర్ ప్రయాణికులు తమకు ఏ ఆపద ఎదురైన వెంటనే పోలీసులకు దృష్టికి తీసుకెళ్లవచ్చునని సూచించారు.
ఒప్పందం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..” క్యాబ్‌ల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ఆపద ఎదురైతే, వెంటనే ఉబర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేఫ్టీ టూల్‌కిట్‌లోని ఎస్‌వోఎస్ బటన్‌ను నొక్కాలి. లేదా డయల్ 100ను స్వాప్ చేయాలి. దీంతో ఆ వాహనానికి సంబంధించిన సమస్త సమాచారం క్షణాల్లో పోలీసులకు చేరుతుంది. ఉబర్ క్యాబ్ లైవ్ లొకేషన్, క్యాబ్ నెంబర్, డ్రైవర్ నెంబర్ అన్నీ వివరాలు పోలీసుల వద్ద ప్రత్యక్షమవుతాయి. ఈ సమాచారం పోలీస్ కంట్రోల్ రూం, సమీప ప్రాంతంలోని ఎస్‌హెచ్‌వో దగ్గరిలోని పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బందికి ఏక కాలంలోనే వెళ్తుంది. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని తేలికగా ట్రాక్ చేస్తారు. హాక్ఐ మొబైల్ యాప్‌లో నమోదు చేసిన కుటుంబ సభ్యుల, స్నేహితుల ఫోన్ నంబర్లకు కూడా ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఇప్పటికే ఓలా, తోరా క్యాబ్లతోనూ ఈ ఒప్పందం పూర్తి అయ్యింది. ఇప్పుడు ఉబర్‌తో ఒప్పందం కుదరింది” అని ఆమె అన్నారు.
ఇక, ఉబర్ సంస్థ సప్లై అండ్ సిటీస్ ఆపరేషన్ డైరెక్టర్ శివశైలేంద్ర మాట్లాడుతూ..” భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఉబర్ సంస్థ తెలంగాణ పోలీసులతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో మా సంస్థ మహిళలకు మరింత భద్రత కల్పిస్తాం. ఈ ఒప్పందం మాకెంతో సంతోషాన్ని కల్గించింది” అని ఆయన అన్నారు.