టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభ విజయవంతం - MicTv.in - Telugu News
mictv telugu

టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభ విజయవంతం

May 13, 2017

హైదరాబాద్ నాంపల్లిలో రెడ్ రోజ్ గార్డెన్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ద్వితీయ మహాసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఐ అండ్ పిఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సమాజంలో సమస్యల పరిష్కారానికి జర్నలిస్టుల పాత్ర కీలకం అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. జర్నలిస్టులు మంచి విషయాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు జర్నలిస్టులను వాడుకున్నాయే తప్ప ఆదుకోలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఈ మహాసభలను ప్రతీ ఏటా పండుగలా జరపాలన్నారు. జర్నలిస్టులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్సే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేసినట్లు తెలిపారు.

సిటీలోని జర్నలిస్టులందరినీ డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిధిలో తెస్తామని మంత్రి తలసాని చెప్పారు.

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2001లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడిందని తెలిపారు. 13 సంవత్సరాలు తెలంగాణ పోరాటంలో పాలు పంచుకుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్ల నిధిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. 16 వేల మందికి అక్రిడేషన్లు అందజేశామన్న అల్లం నారాయణ.. ప్రభుత్వ ఉద్యోగులకు సమాన స్థాయిలో జర్నలిస్టులకు సైతం హెల్త్‌కార్డులు ఇచ్చామన్నారు.