Telangana VS Central Govt..Whats Next
mictv telugu

సిట్ వర్సెస్ ఈడీ,ఐటీ..ఏం జరగబోతోంది?

November 23, 2022

తెలంగాణలో నయా వార్ జరుగుతోంది. ఇటు సిట్ దూకుడు..అటు ఐటీ, ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలు వీటి చుట్టూ తిరుగుతున్నాయి. టీఆర్ఎస్ , బీజేపీ నేతల మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. విచారణకు మీరంటే మీరు భయపడుతున్నారని పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ వేడెక్కింది.దర్యాప్తు సంస్థల విచారణ ఎప్పుడు ముగుస్తుంది. భవిష్యత్‌లో ఇంకెన్ని మలుపులు ఉంటాయి. ఎంక్వైరీ వార్ లోపైచేయి ఎవరిది?కేసీఆర్ ప్రభుత్వం పైచేయి సాధిస్తుందా? కేంద్రం పెత్తానమే నడుస్తుందా?2023 ఎన్నికలనాటికి ఏం జరుగుతోంది?ఎవరి గుట్టు..ఎవరు విప్పుతారు?

సిట్ వర్సెస్ ఐటీ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ వేగంగా జరుగుతోంది. ఈ ఎపిసోడ్‌తో సంబంధం ఉన్నవాళ్లకు నోటీసులు ఇస్తుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను విచారించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందుకోసం కోర్టుకు వెళ్లింది.20న నోటీసులు అందినప్పటికీ విచారణకు రాలేదని తెలిపింది. 41సీఆర్పీసీ కింద మరోసారి సంతోష్‌కు మెయిల్ ద్వారా నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారుల్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.సంతోష్‌ని అరెస్టు చేయొద్దని ఇచ్చిన స్టేని ఎత్తేయాలని ఏజీ కోరారు. ఏజీ విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది.

బండి కన్నీళ్లు-కవిత కౌంటర్

ఎమ్మెల్యేల ఎర కేసులో అనవసరంగా బీఎల్ సంతోష్‌ను లాగుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. దేశం కోసం పనిచేస్తున్న ప్రచారక్ లను టీఆర్ఎస్ వేధిస్తుందని బండి సంజయ్ కన్నీళ్లు పెట్టారు. కేసులకు బీజేపీ భయపడదని, ఎన్ని పెట్టినా ఎదుర్కొంటామన్నారు. బండి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. బీఎస్ సంతోష్‌కు నోటీసులు ఇస్తే ఎందుకు భయపడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే బీఎల్ సంతోష్‌ని విచారణకు రప్పించాలని సవాల్ చేశారు. మేము విచారణకు వెళ్తున్నప్పుడు బీఎల్ సంతోష్ ఎందుకు రారని కవిత ప్రశ్నించారు.

ఐటీ పంజా-గులాబీ గుస్సా

తెలంగాణ పై ఐటీ, ఈడీలు నెలరోజులుగా ఫోకస్ చేశాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో మొదలైన సెర్చింగ్ ..తలసాని బంధువుల ఇంటిమీదుగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు,కార్యాలయాలదాకా వచ్చింది. మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థల్లో రెండురోజులుగా ఐటీ రైడ్ చేస్తోంది. ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డితో సహా టీఆర్ఎస్ నేతలు గుస్సా అవుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం ఇలా చేయిస్తుందని ఫైర్ అయ్యారు. హవాలా, బ్లాక్ మనీ దందాలు చేయడం లేదని, న్యాయబద్ధంగా విద్యాసంస్థలు నడుపుతున్నానని మల్లారెడ్డి చెప్పారు. తన కుమారుడు భయంతో వణికిపోతున్నాడని, సీఆర్పీఎఫ్ సిబ్బంది దాడి చేశారని ఆయన ఆరోపించారు. చట్టం తమ పని తాము చేసుకుపోతుందని , టీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఐటీ అధికారులకు దొరక్కుండా మంత్రి మల్లారెడ్డి ఫోన్ ఎందుకు దాచిపెట్టారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

రాష్ట్రం వర్సెస్ కేంద్రం

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో రచ్చ మొదలైంది. ఇందులో కొందరు టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని బీజేపీ ఆరోపణలు చేసింది. విచారణను మొదలుపెట్టిన ఈడీ తెలంగాణలో నజర్ పెట్టింది. లిక్కర్ స్కామ్‌లోపలువురిని అరెస్ట్ చేసింది. త్వరలో సీబీఐ ఎంటర్ అవుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈలోపే రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టకుండా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. నిజానికి ఈ తీర్మానం ఎప్పుడో చేశారు. కానీ లిక్కర్ విచారణ సమయంలో బయటకు వచ్చింది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ విచారణ నెమ్మదించింది.ఇంతలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు బయటకొచ్చింది. ఇందుల్లో బీజేపీ నేతలు ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు రెండుసార్లు ఇచ్చారు. ఇలా కాక మీద ఉండగా ఐటీ ఎంటరైంది. టీఆర్ఎస్ నేతల ఇళ్లపై నజర్ పెట్టింది. వార్ రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా మారింది. ఇంకెన్ని ఊహించని మలుపులు తిరుగుతుందో..చివరకు ఎవరు పైచేయి సాధిస్తారో..చూడాలి.