తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డెంగ్యూపై యుద్ధం ప్రకటించింది. జీహెచ్ఎంసీ సహా అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో డోర్ టు డోర్ జ్వరం సర్వేను చేపట్టాలని అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో రోజురోజుకి డెంగ్యూ కేసులు పెరుగుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..”డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకోండి. వైద్యారోగ్యశాఖ, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు కలిసి పనిచేస్తే, మంచి ఫలితాలు వస్తాయి. డెంగ్యూ నివారణ చర్యల్లో ప్రజాప్రతినిధులకు, ప్రజలకు భాగస్వామ్యం కల్పించండి. డెంగ్యూ నివారణపై రూపొందించిన పోస్టర్ ఇదే. రాష్ట్రంలో ప్రతి ఐదేండ్లకు ఒకసారి డెంగ్యూ కేసులు పెరుగుతుంటాయి. ఇది ఐదోవ సంవత్సరం కాబట్టి కేసులు కొంచెం ఎక్కువగానే పెరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో జూలైలో 542 కేసులు, ఆగస్టులో 1,827 కేసులు రికార్డయ్యాయి” అని ఆయన అన్నారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించాలి. నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయండి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రణాళిక రూపొందించండి. గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బాగా చేశాం. ఈసారి కూడా ఆ ఈ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టర్లు జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టండి. ప్రజలను, విద్యార్థులు, టీచర్లు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయండి” అని ఆయన అన్నారు.