తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ, ఓ విహహితపై అత్యాచారానికి పాల్పడిన మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగేశ్వరావుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకొని, విచారణ జరిపి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలో వనస్థలిపురం పోలీసులు జరిపిన విచారణలో నాగేశ్వరావు..”అవును అత్యాచారం చేశాను. రివ్యాలర్తో బెదిరించాను. విషయం బయట పెడితే చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాను.” అని నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం వాంగ్మూలంలో నాగేశ్వరరావు పేర్కొన్న వివరాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. “నేను ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు నాలుగేళ్ల క్రితం బాధితురాలి భర్తపై క్రెడిట్ కార్డులను సేకరించి, మోసం చేశాడంటూ బేగంపేట, మహంకాళి పోలీస్ స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాయి. అప్పట్లో అతడిని అరెస్ట్ చేసి, జైలుకు పంపించాను. ఆ సమయంలో బాధితురాలు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వచ్చింది. పుట్టగొడుగుల పెంపకంలో భారీగా నష్టాలొచ్చాయని చెప్పింది. దాంతో నేను వెలిమినేడులోని నా ఫామ్ హౌస్‌లో పుట్టగొడుగులను పెంచాలని, దానికి కాపలాదారుగా ఉద్యోగం ఇస్తానని చెప్పాను. ఆమె భర్త బెయిల్‌పై బయటకు వచ్చాక ఫామ్ హౌస్‌లోనే నియమించుకున్నాను. ఫామ్ హౌస్‌కు తరచూ వెళ్లి ఆమెతో మాట్లాడేవాణ్ని. ఆమె కుమారుడు, కుమార్తెల పుట్టినరోజు వేడుకలకు హాజరై బహుమతులు ఇచ్చేవాణ్ని. గతేడాది ఫిబ్రవరిలో నా కోరిక తీర్చుకునేందుకు ఆమెను కారులో తీసుకెళ్లి ఫామ్ హౌస్ సమీపంలోని మాదాపురం గ్రామంలో నా స్నేహితురాలి ఇంట్లో దింపాను. అక్కడికి నుంచి బయటికి రాగా.. బాధితురాలు తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అతడు నాకు ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులకు చెబుతాననడంతో క్షమించాలని వేడుకున్నాను.
ఈ క్రమంలో ఈ నెల 1న ఆమె భర్త ఇంట్లో లేడని తెలుసుకుని అత్యాచారానికి పాల్పడ్డాను. అనంతరం బాధితురాలిని ఆమె భర్తను వారి సొంతూరిలో వదిలి పెట్టేందుకు కారులో తీసుకెళ్లాను. కానీ, ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద కారు ప్రమాదానికి గురైంది. బాధితురాలు, ఆమె భర్త తప్పించుకుని వెళ్లిపోయారు. నా ఫోను కోసం చూడగా కనిపించలేదు. ఈలోపు గస్తీ బృందం రాగా ఆక్టోపస్ అధికారినంటూ వారికి అబద్ధం చెప్పాను. కొత్తపేటలోని ఇంటికి వెళ్లిన తర్వాత చిరిగిపోయిన నా దుస్తులపై ఆధారాలు లభించకుండా నేనే నా బట్టలు ఉతుక్కున్నాను. పోలీసులు కేసు నమోదు చేస్తారని ఊహించి బెంగళూరుకు పారిపోయాను” అని నాగేశ్వరరావు పేర్కొన్నారు.