చింత బరిగెలు ఇరగాలి... - MicTv.in - Telugu News
mictv telugu

చింత బరిగెలు ఇరగాలి…

June 5, 2017

ఆంధ్రావాళ్ళకింకా మన తెలంగాణ మీద పాయిరం చావనట్టుంది. అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ మీద వారి సవతి ప్రేమని ప్రదర్శిస్తూనే వున్నారు. తొమ్మిదిసార్లు నంది అవార్డులు పొందిన రచయిత, దర్శకుడు ఖాజా మీద ఆంధ్రావాళ్ళు తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డు అయిన హైదరాబాదులోనే వాళ్ళ జులుం చూపారు. ఆ నాటకాన్ని వేయొద్దని రచయిత మీద దాడి కూడా చేసారు. మన ప్రాంత యాసను అప్పట్లో ఎలా అవమానించారనే పాయింటుని బేస్ చేస్కొని సాగే ‘ చింత బరిగెల స్కీం ’ నాటకాన్ని ప్లే చెయ్యకుండా ఆపారు ఆంధ్రా జర్నలిస్టులు. ప్రెస్ క్లబ్ లో 4 జూన్ 2017 నాడు సాయంత్రం జరిగింది ఈ దుస్సంఘటన. పాలోల్ల లొల్లి వద్దని మన రాష్ట్రాన్ని మనం ప్రాణాలకు తెగించి మరీ సాధించుకున్నాం.

సాధించుకున్న రాష్ట్రంలో మన పనులు మనం చేస్కుంటున్నాం. కానీ వాళ్ళ కళ్ళ మంట మన మీదింకా చల్లారలేదు. అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మన అవతరణ దినోత్సవాన్ని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చీకటి రోజంటారు. ఇన్ని రోజులు మనవాళ్ళు చీకట్లో మగ్గి ఇప్పుడిప్పుడే వెలుగులని పంచుకుంటున్నారు. అరవై ఏళ్ళ మన చీకటి వెతల గురించి చంద్రబాబుకి కాస్త కూడా కనికరం లేదుగానీ తెలంగాణ రాష్ట్రం వేరుపడటం ఆయనకింకా మింగుడు పడకపోవడం ఎంత దుర్మార్గం ? ఇలా చాలా మంది తెలంగాణ రాష్ట్రం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అక్కసు వెళ్ళగక్కుతున్నారు.

‘ అయ్యో కాస్తలో తెలంగాణాని జార విడిచేసామని ’ ఇప్పటికి వాళ్ళు కళ్ళ మంటను చల్లార్చుకోలేక పోతున్నారు. ఏదైనా మిరకిల్ జరిగి మళ్ళీ తెలంగాణ ఆంధ్రాలో కలిసిపోయుంటే బాగుండని కూడా వాళ్ళ మనసుల్లో కుమ్ముసం నిండుకొని వుంది. తెలంగాణా వాళ్ళు ఎదిగితే మనల్ని కేర్ చెయ్యరని వాళ్ళకి ముందు నుండి కాబట్టి ఫస్ట్ నుండి వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, సినిమాపరంగా, సంస్కృతి పరంగా.., మనలను పాతాళానికి అణిచేసి తెలుగు అంటే కేవలం ఆంధ్రా సంస్కృతే అన్నట్టు చాలా లౌక్యంగా ఆరు దశాబ్దాలకు పైన్నే తెలంగాణా వాళ్ళను అణిచివేసారు, అవమానించారు, అవహేళనలుకి గురి చేసారు ?

ఈ ఆంధ్రావాళ్ళ కన్నా నిజాం నవాబే నయమనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. తమ ఉనికిని బలోపేతం చేస్కోవడానికి ఆంధ్రావాళ్ళు తెలంగాణాకి చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిది, వర్ణించ తరం కానిది. మన అస్థిత్వాన్ని చంపి వాళ్ళ శిరసులు నిలుపుకున్న మహానుభావులు ఆంధ్రావాళ్ళు. యూట్యూబ్ లో కూడా మన వేష, భాష, యాసల్లో వచ్చే కార్యక్రమాల మీద ఆంధ్రా నాగులు మెయిల్స్ ద్వారా చిమ్ముతున్న విషం అంతా ఇంతా కాదు. చాలా దారుణమైన పదజాలంతో తెలంగాణ మీద వారి విషం వెళ్ళగక్కుతున్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు దేవుడైతే తెలంగాణావాళ్ళకి కూడా కేసీ ఆర్ కూడా అంతే కదా.
అరవై యేళ్ళ బానిసత్వాన్ని దూరం చేసి తెలంగాణా వాళ్ళ అస్తిత్వాన్ని నిలిపిన గాడ్ కేసీఆరే కదా.. కేసీఆర్ అంటే వాళ్ళకి ఇప్పటికీ గిట్టదు. వాళ్ళిలా ఎందుకు ఆలోచించరో అర్థం కాదు. ‘ ఇన్నాళ్ళూ ఈ బతుకమ్మ పండుగ, పేరిణి, ఒగ్గుడోలు, కాకిపడగలు వంటి కళలు ఎటు వెళ్ళిపోయాయని వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలంగాణ మీద పాయిరం పెరుగుతుంది కదా.. కానీ వాళ్ళలా ఆలోచించరు. అయ్యో చేజార్చుకున్నామనే కుత్సిత బుద్ధి తప్ప మరేమి లేదు. చింత బరిగెల స్కీం నాటకాన్ని వాళ్ళు ఆంధ్రా ప్రాంతంలో అడ్డుకున్నా ఫరవాలేదు. కానీ ఏకంగా వాళ్ళు ఇక్కడ హైదరాబాదులోనే ఇలాంటి నీఛమైన పనికి దిగజారడం అనేది తెలంగాణ ప్రజానీకం అంతా కలిసి తీవ్రంగా ఖండించాల్సిన విషయం.

ఇంకా ఎంతకాలం ఈ వివక్షా విషాలు విరజిమ్ముతాయని తెలంగాణా బిడ్డలంతా సోషల్ మీడియా సాక్షిగా ఘాటుగా ఖండిస్తున్నారు. మనం వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ మనవేమైనా ప్రదర్శిస్తే అడ్డుకోవడంలో తప్పుంది. కానీ మన గడ్డ మీద మన కళలను, మన నాటకాలను మనం ప్రదర్శించుకుంటే తప్పెలా అవుతుంది. మనమేమీ ఆంధ్రావాళ్ళ మీద పని గట్టుకొని విష ప్రచారాలు చెయ్యట్లేదు కదా ? మనం అనుభవించిన వివక్షనే చూపిస్తున్నాం. అది తప్పెలా అవుతుంది ? దీని మీద మన ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీస్కోవాలి. లేదంటే వాళ్ళిలా చీటికీ మాటికీ మనకి పుల్ల పెట్టాలని చూస్తే తప్పకుండా చింత బరిగెలు వీపుల మీద విరగడం ఖాయమని నెటిజనులు గుస్సా అవుతున్నారు….

  • సంఘీర్

నిన్న జరిగిన సోమజి గూడ ప్రెస్ క్లబ్ కళాకారుల దాడి ఘటన పైన కళాకారుల ఆగ్రహం…

Posted by Srinu Nani on Monday, 5 June 2017