Telangana’s Warangal joins UNESCO Global Network of Learning Cities
mictv telugu

ఏడాదిలోపే మరో ఘనత.. వరంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు

September 6, 2022

తెలంగాణలోని పలు నగరాలకు సాంస్కృతిక పరంగా ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. తాజాగా వరంగల్‌ నగరానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్‌వర్క్‌లో వరంగల్‌కు చోటు లభించింది. ఇప్పటికే వరంగల్‌లోని ప్రఖ్యాత రామప్ప ఆలయానికి వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది వ్యవధిలోనే వరంగల్‌కు యునెస్కో నుంచి రెండుమార్లు గుర్తింపు లభించడం విశేషం.

 

యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు వరంగల్ తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేస్తూ ఓరుగల్లుు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు, మంత్రి కేటీఆర్‌కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.