చదువులో ఒత్తిడి.. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏదో అన్నారని వెనకా ముందు ఆలోచించకుండా యువత ఉసురు తీసుకుంటూ అయినోళ్లకు తీరని శోకం మిగులుస్తున్నారు. తాజాగా నార్సింగిలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి తరగతి గదిలోనే ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. చాలామంది ఆత్మహత్యకు పాల్పడే ముందు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. ఈ సమయమే చాలా కీలకమైంది. వారి ఉద్దేశాన్ని గుర్తించి సరైన కౌన్సెలింగ్ లేదంటే చికిత్స అందించగలిగితే ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
విద్యార్థులకు ఉపశమనం కలిగించడానికి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకొన్నది. వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించుకొనే అవకాశం ఇచ్చింది. విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించి, ఒత్తిడి తగ్గించుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఈ టెలిమానస్ ద్వారా విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వడమేగాక మార్గదర్శనం చేయనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా, విద్యార్థుల్లో ఆందోళన, భయం, ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. దీంతోపాటు ప్రభుత్వ దవాఖానల్లో జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్‌ల సేవలను 24 గంటల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని సూచించారు.