కొత్త సంవత్సరం వేళ టెలికాం కంపెనీలు వినియోగదారులకు చేదువార్త చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. మొబైల్ రీజార్జ్ ధరలను కనీసం పది శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆర్ధిక సేవల సంస్థ జెఫెరీస్ వెల్లడించింది. కంపెనీల మధ్య తీవ్రపోటీ, నంబర్ పోర్టబిలిటీ, 5జీ సేవల కారణంగా సంస్థలపై భారం పెరుగుతోందని, దీంతో చార్జీలు పెంచకతప్పట్లేదని తెలిపింది. మార్చి నాటికి ధరల పెంపు ఉంటుందని అంచనా వేసింది. అటు ఎయిర్ టెల్, జియోలు 2023, 2024, 2025 ఆర్ధిక సంవత్సరాల చివరలో టారిఫ్ లు పెంచుతున్నట్టు ఇప్పటికే ప్రకటించగా, గత ఆర్ధిక సంవత్సరంలో జియో 0.8 శాతం, వొడాఫోన్ ఐడియా 1 శాతం, ఎయిర్ టెల్ 4 శాతం టారిఫ్ ను పెంచాయి. అటు సెప్టెంబర్ నాటికి సబ్ స్క్రైబర్ల లెక్కలను ట్రాయ్ విడుదల చేసింది. దాని ప్రకారం ఆ నెలలో జియోకు 7.2 లక్షల మంది, ఎయిర్ టెల్ కి 4.12 లక్షల మంది కొత్తగా చేరారు. వొడాఫోన్ ఐడియా మాత్రం 40 లక్షల మందిని కోల్పోయింది. ఎయిర్ టెల్, జియోలు 5జీని ప్రారంభించాయి కాబట్టి కస్టమర్లు అటు వైపు వెళ్తున్నారు.