వాడు ఇస్తానంటే..వీళ్లకేం నొప్పి..? - MicTv.in - Telugu News
mictv telugu

వాడు ఇస్తానంటే..వీళ్లకేం నొప్పి..?

June 17, 2017

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే జియో వచ్చాక.. డేటా చార్జీలు తగ్గాయ్.స్మార్ట్ ఫోన్లలో నెట్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఎవరి చేతిలో చూసిన 4జీ ఫోన్..అందులో జియో సిమ్..మస్ట్. వచ్చీ రావడంతోనే మిగతా టెల్కోలకు షాక్ ఇచ్చి వినియోగదారుల్ని తమవైపు తిప్పుకుంది. మూడు నెలలు ఫ్రీ ఆన్ లిమిటెడ్ కాల్స్ ,రోజుకు 1జీబీ డేటా.. ఆ తర్వాత మూడొందలకే మరో మూడు నెలలు ఫ్రీ అంటూ కస్టమర్లను నిలుపుకుంది. ఇదే దిగ్గజ టెలికాం కంపెనీలైన ఎయిర్ టెల్ , ఐడియా,వోడాఫోన్ కు కాలింది. ఎలాగైనా జియోకు కళ్లెం వేయాలని చేయని ప్రయత్నం లేదు. అన్నిరూట్లలో వెళ్లి ఆరోపణలతో మీద ఆరోపణలు చేస్తూ చీటింగ్ చేస్తుందంటూ మొత్తుకుంటున్నాయి. నయా పైసా ఆఫర్ లేకుండా ఇన్నాళ్లూ దోచుకున్న ఎయిర్ టెల్ , ఐడియాలు..ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటోన్న జియోను చూసి కుల్లుకుంటున్నాయి. వీళ్లు ఇవ్వరు..వాడు ఇస్తే ఓర్వలేరు. ఈజలాసీ పీక్స్ కు చేరింది. జియోకి వ్యతిరేకంగా అన్ని టెల్కోలు ఏకమయ్యాయి. ఇంతకీ టిలివార్ లో గెలుపు ఎవరిది..?

ఐడియాకి ఇన్నాళ్లూ ఐడియాలు రాలేదు.. ఇప్పుడు రావడం లేదు. ఎయిర్ టెల్ ఆఫర్లు పెట్టదు..పెడితే ఓర్చుకోదు. ఎయిర్ టెల్ కస్టమర్లు గాలొస్తే కొట్టుకుపోతున్నారు. మిగతా ఏ టెలికాం ఆపరేటర్ పరిస్థితైనా ఇలాగే ఉంది. జియో ఆఫర్లతో వీటి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎప్పుడొచ్చమన్నది కాదు ఎన్ని ఆఫర్లతో వచ్చారన్నది పాయింట్. జియో సరిగ్గా ఇలాగే ఎంటరైంది. వినియోగదారుల పల్స్ పట్టుకుంది. ధనాధన్ పవర్ పంచ్ లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. ఇప్పటికి చూపిస్తూనే ఉంది. అందుకే జియోకి వ్యతిరేకంగా టెల్కోలు ఏకమయ్యాయి.

టెలికాం కంపెనీల మధ్య వార్ మళ్లీ తెరపైకి వచ్చింది. జియోకి వ్యతిరేకంగా ఏకమైన దిగ్గజ కంపెనీలు దోపిడీధరలతో జియో కస్టమర్లను మోసం చేస్తోందని విరుచుకుపడ్డాయి. ఈ మేరకు ఇంటర్మీడియాలిటీ గ్రూప్ (ఐఎంజీ) ముందు తమ వాదనను వినిపించాయి. ఫైనాన్స్, టెలికాం మంత్రిత్వ శాఖల అధికారుల బృందంతో మాట్లాడిన కంపెనీలు, జియో వాస్తవికతను తప్పుగా చూపించిందన్నాయి. తక్కువ ధరకే డేటా సేవలను ఆఫర్‌ చేసి మార్కెట్‌ షేరును గెలుచుకోవాలని చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్‌ టెల్‌ జియో “దోపిడీ ధర” విధానాన్ని స్వీకరించిందని ఆరోపించింది. తద్వారా పరిశ్రమల ఆదాయం, నికర ఆదాయం, క్యాపిటల్స్‌ను తిరిగి రాబట్టడంలో తీవ్రంగా నష్టపోయిందని ఎయిర్ టెల్ ఆరోపించింది. దీన్ని నిరోధించాలని ఐఎంజీని కోరింది. అంతేకాదు, టెలికాం నియంత్రణాధికారి ట్రాయ్ కోర్టులో అంతిమ నిర్ణయం తీసుకునే వరకు ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ధరలను నియంత్రిచాలని కోరాయి. లేదంటే తమకు “కోలుకోలేని ఆర్థిక నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశాయి.

సరే ఏకమైన టెల్కోలు ..వాళ్ల కష్టాల్ని చెప్పుకున్నాయి. అదీ మనకు అనవసరం..కానీ కస్టమర్లను వీరు ఆకట్టుకోవడానికి ఎన్ని ఆఫర్లు ఇస్తున్నారు..?ఇచ్చిన ఒకటి రెండు ఆఫర్లలో తలతిక్క రూల్స్ ఎందుకు పెడుతున్నారు. దాదాపు పదేళ్లపాటు ఎయిర్ టెల్ వాడుతున్న వారు సడెన్ గా జియోకు ఎందుకు మారుతున్నారో ఆ కంపెనీ ఆలోచించలేకపోతోంది. తాను ఇవ్వను..ఇంకొకడు ఇస్తుంటే ఊరుకోనంటే ఎలా…ఇదెక్కడి న్యాయం..ఇదెక్కడి పద్దతి…
అయినా అంబానీలు అడుగు పెట్టారంటే అందరూ మటాషే..ఏ రంగంలో నైనా ఇంతే. అంబానీల లెగ్ పడిందంటే వారి ఆలోచనలముందు చిత్తు కావాల్సిందే. అప్పటివరకు ఓ వెలుగువెలిగినా చీకట్లలోకి వెళ్లాల్సిందే.ఎందుకంటే వారి ప్లాన్స్, స్ట్రాటజీలు అలా ఉంటాయి. అందుకే జియో ముందు ఎవడి దిమ్మైనా తిరగాల్సిందే…ఎన్ని ఆరోపణలు చేసినా దుకాణం సర్దుకోవాల్సిందే..