”కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ పాలన వల్ల రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజం చెప్తున్నా.. మోదీ పాలనలో ఈరోజు ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. ప్రధానిగా కాకుండా దేశానికి సేల్మన్గా మోదీ వ్యవహరిస్తున్నారు” అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నేడు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతు పలికిన ఆయన.. జలవిహార్లో సభను నిర్వహించారు.
కేసీఆర్ మాట్లాడుతూ..”యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నా. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తి. న్యాయవాదిగా కెరీర్ను ప్రారంభించారు. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారు. ఆర్థిక మంత్రిగా, ఆయనకు అన్ని రంగాల్లో చాలా అనుభవం ఉంది. మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. టార్చిలైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. డీజిల్ సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారు. ఇది చాలదన్నట్లు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారు” అని ఆయన అన్నారు.
మరోపక్క హైదరాబాద్లోని హైటెక్ సీటీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి నాయకులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్కు రావడంతో కేసీఆర్, కేటీఆర్, పలువురు మంత్రులు బేగంపేట విమాన ఆశ్రయంలో స్వాగతం పలికారు. ఓవైపు టీఆర్ఎస్ సభ మరోవైపు బీజేపీ కార్యక్రమాలు ఒకేరోజు ఉండడంతో పోలీసులు హైఅలెర్ట్ అయ్యారు. ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా నగరమంతా మోహరించారు.