ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై అక్క, వదిన, భార్య, తల్లి పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎక్కువగా కమెడియన్ల సరసన నటించి.. తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. ఇండస్ట్రీలో నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హేమ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతేడాది, ఈ ఏడాది ప్రారంభంలో చాలా సినిమాలు విడుదలైనా ఒక్క సినిమాలోను ఆమె కనిపించకపోవడం గమనార్హం.
జబర్ధస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ రెండవ బ్రాంచ్‌ను ఇటీవల మణికొండలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన హేమ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు ఎందుకు? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘ఈ మధ్య కొత్త బిజినెస్ పెట్టాను. అందులో మంచి లాభాలు వస్తున్నాయి. సంపాదన ఎక్కువ అవడంతో సుఖ పడటం అలవాటు అయిపోయింది. కష్టపడటానికి ఇష్టపడటం లేదు అంతే’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అయితే అది ఎలాంటి బిజినెస్ అనేది మాత్రం ఆమె చెప్పేందుకు ఆసక్తి చూపలేదు. సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ మాట దాటేసింది.