శ్రావణి కేసు.. A1 నిందితుడు సాయినే.. పోలీసులు చెప్పిందిదీ..  - MicTv.in - Telugu News
mictv telugu

శ్రావణి కేసు.. A1 నిందితుడు సాయినే.. పోలీసులు చెప్పిందిదీ.. 

September 14, 2020

Telugu Actress incident: Harassment, Betrayal Drove Sravani To Extreme Step

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కుంటున్న సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆడియో టేపుల ఆధారంగా పలు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు ఇవాళ మధ్యాహ్నం వారిద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. శ్రావణి కేసులో ఏ1 నిందితుడిగా సాయికృష్ణారెడ్డి, ఏ2గా ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిలను చేర్చారు. దేవరాజ్ రెడ్డిని ఏ3 నిందితుడిగా చేర్చామని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. 


మీడియాతో డీసీపీ మాట్లాడుతూ.. ‘ఈ నెల 8న శ్రావణి(26) హైదరాబాద్ మధురానగర్‌‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసును దర్యాప్తు చేయగా అనేక విషయాలు తెలిశాయి. శ్రావణి 2012లో హైదరాబాద్ వచ్చింది. అప్పటినుంచి టీవీ నటిగా ఎదగాలని  అవకాశాల కోసం ప్రయత్నించింది. 2015లో శ్రావణికి ఓ స్నేహితురాలి ద్వారా అనంతపురానికి చెందిన సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మూడేళ్ల పాటు సన్నిహితంగా కొనసాగారు. ఈ క్రమంలో 2017లో ఆమెకు అశోక్ రెడ్డి అనే నిర్మాత పరిచయం అయ్యాడు. అశోక్ రెడ్డి నిర్మించిన ‘ప్రేమతో కార్తీక్’ అనే చిత్రంలో శ్రావణికి చిన్న పాత్ర ఇచ్చాడు. అప్పటినుంచి అశోక్ రెడ్డితోనూ ఆమె స్నేహంగా ఉండేది. ఇక 2019 ఆగస్టు నుంచి దేవరాజ్ రెడ్డితో టిక్‌టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. దేవరాజ్ రెడ్డితో శ్రావణి సన్నిహితంగా ఉండడం సాయికి నచ్చలేదు. ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో అప్పటినుంచి శ్రావణిని ఆమె తల్లిదండ్రులు, సాయి వేధించసాగారు. ఈ క్రమంలో దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులే కాక, సాయి, అశోక్ రెడ్డి కూడా హెచ్చరిస్తుండేవారు. మేము దేవరాజ్ రెడ్డి కాల్ డీటెయిల్స్ కూడా విశ్లేషించాం. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ఆమె గత సంబంధాలు తెలిసి దూరంగా పెట్టాడు. శ్రావణి తీరు నచ్చక మాట మార్చాడు. దీంతో శ్రావణి మనస్తాపం చెంది తల్లిదండ్రులకు, సాయికి, అశోక్ రెడ్డికి, దేవరాజ్‌కు దూరంగా ఉండడం ప్రారంభించింది’ అని తెలిపారు.

శ్రావణి ప్రవర్తన నచ్చని సాయి, అశోక్ రెడ్డి, తల్లిదండ్రులు మరింత ఆమెను వేధించసాగారని అన్నారు. సాయి, అశోక్ రెడ్డి తనపై భౌతికదాడులు చేశారని కూడా శ్రావణి ఓ సందేశంలో తెలిపిందని వివరించారు. ‘సాయి, అశోక్ రెడ్డిల బెదిరింపులు, దాడులు.. తల్లిదండ్రుల ప్రవర్తన ఆమెను కృంగదీశాయి. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన దేవరాజ్ రెడ్డి ఆపై దూరంగా జరగడంతో ఆమె మరింత కృంగుబాటుకు లోనైంది.  వీరు ముగ్గురూ ఏదో ఒక సందర్భంలో ఆమెను పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మోసం చేశారు. ఇలాంటి వాళ్ల పట్ల మిగతా అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. వారి వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ కేసులో సాయికృష్ణారెడ్డిని ఏ1, అశోక్ రెడ్డిని ఏ2, దేవరాజ్ రెడ్డిని ఏ3గా తేల్చాం. ఈ కేసులో ఇప్పటికే సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న అశోక్ రెడ్డిని కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తాం. అలాగే ఈ ఘటనలో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా పేర్కొనడం లేదు. ఎందుకంటే ఏ కూతురిని కూడా తల్లిదండ్రులు చనిపోవాలని వేధించరు. ఆమె శ్రేయస్సు కోరి కొంత కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు. మేము విశ్లేషించిన సంభాషణల్లో శ్రావణిని తల్లిదండ్రులు కూడా ఇబ్బందిపెట్టినట్టు వెల్లడైంది. కానీ, తల్లిదండ్రులను ఇందులో నిందితులుగా పేర్కొనడం లేదు. వారిని బాధిత వ్యక్తికి చెందినవారిగా భావిస్తున్నాం’ అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాగా, శ్రావణి స్వస్థలం కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు. సినిమాలపై ఆసక్తితో ఆమె హైదరాబాద్ వచ్చి టీవీ నటిగా ఎదిగింది.