భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ బరిలోకి ఏపీకి చెందిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ పేరు వచ్చి చేరారు. ఏపీ ప్రభుత్వం జ్యోతి సురేఖ పేరును నామినేట్ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరు క్రీడాకారిణిలు ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’ పురస్కారానికి నామినేట్ అయ్యారు. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ను హాకీ ఇండియా, భారత మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనిక బత్రా పేరును టేబుల్ టెన్నిస్ సమాఖ్య నామినేట్ చేశాయి.
విజయవాడకు చెందిన 23 ఏళ్ల జ్యోతికి 2017లో ‘అర్జున’ అవార్డు లభించింది. తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో జ్యోతి ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్, వరల్డ్‌కప్‌లలో కలిపి 33 పతకాలను గెలుచుకుంది. ‘ఖేల్‌రత్న’ పురస్కారానికి గడిచిన నాలుగేళ్ల ప్రదర్శనను పరిగణిస్తారు. జనవరి 1, 2016 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు ఆటగాళ్ల ప్రతిభను అవార్డుల కమిటీ పరిశీలిస్తుంది.