రెండ్రోజుల క్రితం ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2021 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 685 మంది ఈ పోస్టులకు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ..
1.నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లె గ్రామానికి చెందిన చల్లపల్లె యశ్వంత్ కుమార్‌రెడ్డి కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్–1లో మూడో ర్యాంక్ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్‌లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్‌లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్ సాధించారు.
2. విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ఈమె.. బీ.ఫార్మసీలో నేషనల్ టాపర్‌గా నిలిచి ఎమ్మెస్సీ చేసి, ఏడాదిపాటు ఉద్యోగం కూడా చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయినట్లు చెప్పారు.
3. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్యభరద్వాజ్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
4. నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ సివిల్స్‌లో 37వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. ఆమె భర్త హర్ష హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో లా ఎక్స్లెంట్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తూ సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాడు. భర్త ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రయత్నించిన సంజనసింహ మూడో ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్‌కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగో ప్రయత్నంలో37వ ర్యాంకు సాధించింది .
5. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఉస్మానియా మెడిసిన్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి, అక్కడే ఎంఎస్ పూర్తి చేసి అక్కడే డాక్టర్ గా పనిచేశారు. భర్త ప్రోత్సాహంతో రెండేళ్ల పాటు సివిల్స్‌కు శిక్షణ పొందారు. 2018లో మొదటి ప్రయత్నంలో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో 573 ర్యాంకుతో ఉద్యోగం పొందారు. 2019లో సివిల్స్ డానిక్స్‌లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. సివిల్స్–2021లో 56ర్యాంకు పొందారు.
6. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందిన తిరుమాని శ్రీపూజ 62వ ర్యాంకు సాధించారు. ఎన్ఐటీ సూరత్కల్లో బీటెక్ చేసిన ఆమె.. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. తాను తొలిసారి సివిల్స్‌కు సిద్ధమైనప్పుడు ఢిల్లీలో శిక్షణ తీసుకున్నానని, తదనంతరం కరోనా కారణంగా ఇంట్లోనే ఉండి ఇపుడు రెండోసారి మెయిన్స్ రాసి విజయం సాధించానన్నారు.
7. 2021 సివిల్స్‌లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్‌కుమార్ సత్తా చాటారు. పశ్చిమబెంగాల్ ఖరగ్‌పూర్‌లో ఐఐటీ పూర్తి చేసిన సుధీర్ కుమార్… ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో 2017 నుంచి ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు.
8. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోడల్ కాలనీకి చెందిన తరుణ్ పట్నాయక్ తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 99వ ర్యాంకు సాధించారు. తరుణ్ తండ్రి రవికుమార్ పట్నాయక్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు
9. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు.
10. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లె గ్రామానికి చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మ దంపతుల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్‌లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. తరువాత ఆన్లైన్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ మెళకువలు నేర్చుకుంది.
11. పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామానికి చెందిన కన్నెధార మనోజ్‌కుమార్ అలిండియా స్థాయిలో 157వ ర్యాంక్ సాధించారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు.
12. గుంటూరు శ్యామలా నగర్‌కు చెందిన కాకుమాను అశ్విన్ మణిదీప్ సివిల్స్‌లో 235 ర్యాంకు సాధించారు. మణిదీప్ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు.
వందమందికి ర్యాంకులు తెప్పించిన బాల లత
సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన వారిలో.. కొందరు హైదరాబాద్‌లోని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న వారూ ఉన్నారు. అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాల లత.. స్వయంగా ఐఏఎస్ కావడంతో సీఎస్బీ అకాడమీని ఏర్పాటుచేసి వందమందికిపైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ర్యాంకులు సాధించిన వారికి అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్బీ అకాడమీ డైరెక్టర్‌ను ఘనంగా సత్కరించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు.