మనసుకు హత్తుకునే పాటలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కన్నుమూశారు. కొన్నాళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం వెంగళరావు నగర్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 49 ఏళ్లు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ చిత్రంలోని ‘మళ్లి కూయవే గువ్వా’ పాటతో సినీ ప్రవేశం చేసిన కందికొండ పాటలు ప్రజాదరణ పొందాయి. ‘చూపుల్తో గుచ్చిగుచ్చి’, ‘గలగల పారే గోదారిలా’, ‘మధురమే మధురమే’ పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. 2018లో ‘నీది నాది ఒకే కథ’ కోసం ఆయన చివరిసారి పాటలు రాశారు. సినీరంగంలోకి రాకముందే కందికొండ తెలంగాణ సంస్కృతికి, పల్లె జీవితాలకు అద్దం పెట్టే హృద్యమైన గీతాలెన్నో రాశారు. బతుకమ్మ, సంక్రాంతి వంటి వివిధ పండగల కోసం రాసిన ప్రత్యేక గీతాలు కూడా వెబ్ మీడియాలో ఆదరణ పొందాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన కందికొండ తెలంగాణ ఆత్మకు అద్దం పట్టే పాటలెన్నో రాశారు. అనారోగ్యంతో బాధపడిన కందికొండను తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది. కోలుకున్నట్టే కోలుకున్న ఆయన ఈ రోజు సాయంత్రం లోకం వీడి వెళ్లిపోయారు.