ఏ విలువలకీ వక్షోజ ప్రదర్శన ప్రస్థానాలు! - MicTv.in - Telugu News
mictv telugu

ఏ విలువలకీ వక్షోజ ప్రదర్శన ప్రస్థానాలు!

March 21, 2018

కేరళలో ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ గొడవ సద్దుమణగక ముందే మరో రచ్చ మొదలైంది. ఓ అధ్యాపకుడు.. మహిళల వస్త్రధారణపై చేసిన విమర్శలపై దుమారం రేగింది. అతని చవకబారు మాటలకు నిరసనగా కొందరు మహిళలు తమ వక్షోజాలను పూర్తిగా,  పాక్షికంగా ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మరింత కాక రేపుతున్నాయి. మహిళల శరీరంపై కామెంట్లు చేసే హక్కు, మోరల్ పోలీసింగ్ హక్కు ఎవరికీ లేదంటూ యువతలు కదం తొక్కతున్నారు. అయితే వారి నిరసన కూడా అంగాంగ ప్రదర్శన కిందికి మళ్లుతుండడంతో ఉద్యమం పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది.

చరిత్ర రివర్స్..

కేరళలో బడుగు కులాల మహిళలు రవిక వేసుకోవడం, లేదా రొమ్ములను బట్టతో కప్పుకోవడం ఒకప్పుడు నిషిద్ధం. దీనికి వ్యతిరేకంగా 19వ శతాబ్దిలో గొప్ప ఉద్యమాలు సాగాయి. దీంతో మహిళలందరూ వక్షోజాలను కప్పుకోవచ్చని చట్టాలు కూడా తీసుకొచ్చారు. తాజాగా మొదలైన మారుతురక్కల్ సమరం.. మాత్రం అందుకు భిన్నం. స్త్రీకి తన శరీరంపై హక్కు ఉందని, తన ఇష్టప్రకారం దాన్ని ప్రదర్శించుకోవచ్చని అంటున్నారు.

అతని మాటలతో గొడవ..

కొజికోడ్‌లోని ఫరూక్ కాలేజీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ జౌహార్ మునావీర్.. ముస్లిం విద్యార్థినులు బురఖా వేసుకోకపోవడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘యువతులు హిజబ్ వేసుకోకుండా, తమ వక్షస్థలాన్ని కోసిన పుచ్చకాయ ముక్కల్లా ప్రదర్శనకు పెడుతున్నారు..’ అని వాగాడు. మహిళలకు అతడు కించపరచడని విమర్శలు వెల్లువెత్తాయి. విష్ణు అనే వ్యక్తి తన ప్రియురాలైన ఆరతి వక్షాల ఫోటోలను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. తర్వాత రెహానా అనే యువతి..తన రొమ్ములను పుచ్చకాల డిప్పల్లో ఉంచి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పడేసింది.

ఇలా మరికొందరు బయటికొచ్చారు. ‘మగవాళ్లకు ఉన్న స్వేచ్ఛ మాకూ ఉంది. మా దేహం, మా ఇష్టం.. ఇందులో అసభ్యత, అశ్లీలం ఏమీ లేదు. మగవాడు తన బాడీని ప్రదర్శిస్తే అందులో బూతేమీ లేదని అంటున్నారు. అదే మేం ప్రదర్శిస్తే బూతు అంటున్నారు? ఇదెక్కడి న్యాయం?’ అని ప్రశ్నించారు. స్త్రీదేహం సెక్స్ వస్తువు కాదని, పురుషుడిలాగే అదొక భౌతిక రూపమని అన్నారు. ఈ ఫోటోలు కాస్తా వైరల్ కావడం, ఫిర్యాదులు రావడంతో ఫేస్‌బుక్ వాటిని తొలగించింది. దీనిపై మళ్లీ గొడవ రేగింది. ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫొటోలకు విస్తృత ప్రచారం కల్పించిన ఫేస్‌బుక్ ఈ విషయంలో మరోలా వ్యవహరించడమేంటని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఎందుకమ్మా.. బజారున పడతారు?

ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉద్యమాన్ని సమర్థించిన వారిలో కొందరు ఈ ‘మారుతురక్కల్ సమరం‘ ఉద్యమంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉద్యమం తల్లి, బిడ్డల అనుబంధంతో ముడి వేసుకున్నదని, బిడ్డ ఆకలి తీర్చడానికి అలా పాలిస్తే తప్పేమీ లేదని, అయితే ఎవరో ఏదో అన్నారని దిగంబరంగా కనిపించడం సరికాదని అంటున్నారు. మోరల్ పోలీసింగ్‌ను నిరసించడానికి చాలా రూపాలు ఉన్నాయని, అంగాంగ ప్రదర్శన ఒక్కటే మార్గం కాదని అంటున్నారు. పైగా ఇలాంటి ప్రదర్శన వల్ల స్త్రీ మగవాళ్ల దృష్టిలో మరింత చులకన అవుతుందని హెచ్చరిస్తున్నారు. అసమాన వేతనాలు, పనిప్రదేశాల్లో మరుగుదొడ్ల కొరత, గృహహింస, నిరుద్యోగం, వరకట్నం, లైంగిక దాడులు.. మరెన్నో దారుణాలకు మహిళలు గురి అవుతున్నారని, ఆ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలని కోరుతున్నారు. స్త్రీలు అన్నిరంగాల్లో ముందుకెళ్తున్న పాశ్చాత్య దేశాల్లోనూ వక్షోజాలను నిరసన పేరుతో ప్రదర్శించడం లేదని గుర్తుచేస్తున్నారు!