హ్యాపి బర్త్ డే సిల్క్ స్మిత - MicTv.in - Telugu News
mictv telugu

హ్యాపి బర్త్ డే సిల్క్ స్మిత

December 1, 2017

వెండితెరకు మన్మథుడందించిన రతీదేవి సిల్క్ స్మిత. ఆమె తనువంతా పొంగిపొర్లేది శృంగార రసమే. ఆ చూపులు మగాళ్లను మత్తులో ముంచే వలపుల బాణాలు. మొత్తంగా ఈ మందస్మిత ఓ సరస సమ్మోహనాస్త్రం.  ఓ జమానాలో మగాడిగా పుట్టిన ప్రతీ ఒక్కడూ కోరి మరీ ఎక్కించుకున్న మత్తుమందు సిల్క్ స్మిత పుట్టిన రోజు ఇవాళ.

సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ. పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. విజయలక్ష్మి తండ్రికి ఇద్దరు భార్యలు. ఈమె మొదటి భార్య బిడ్డ. దేవుడిచ్చిన రూపం విజయలక్ష్మికి శాపంలా మారింది. ఆ చిన్నారి శరీరంతో కోరిక తీర్చుకోవాలన్న కామం ఎందరో మగాళ్ల కళ్లలో కనిపించేంది. దీంతో నాలుగో తరగతి చదువుతున్నప్పుడే విజయకు పెండ్లి చేశారు.

ఆశగా చూసే మగాడి చూపులు, శృంగార రసాధిదేవతకు ఎక్కడా తీసిపోని రూపం విజయలక్ష్మికి కొత్త కోరికల్ని పుట్టించాయి. వెండితెరవేల్పుగా ఉన్న సావిత్రి మీద ఉన్న అభిమానం తెరను ఏలాలన్న ఆశను కలిగించింది. ఇంకేముంది కొద్దిరోజుల్లోనే ఇంట్లో చెప్పాపెట్టకుండా ఏలూరు నుండి మద్రాస్ లోని తన ఆంటీ ఇంటికి వెళ్లింది.

ఎన్నో ఆశలతో చెన్నపట్నం వచ్చిన విజయలక్ష్మికి అంత సులభంగా సినిమాల్లో ఛాన్స్ దొరకలేదు. మొదట్లో సినీ ఫీల్డ్ లో చిన్నా చితక పనులెన్నో చేసింది. తమిళ బి గ్రేడ్ నటులకు మేకప్ వేసింది. దీంతో పాటు చిన్న చిన్న వేషాలు వేసింది. అయితే ఓ రోజు ఫ్లోర్ మిల్ లో విజయలక్ష్మిని చూసి ఆమె అందానికి ఫిదా అయిన డైరెక్టర్ వినూ చక్రవర్తి తనతో పాటు ఇంటికి తీసుకపోయాడు. సినిమాల్లో రాణించడానికి అవసరమైన అన్ని రకాల విద్యల్ని ఒంటపట్టించాడు.వినూ భార్య ఇంగ్లీష్ నేర్పింది.. ఇంకో టీచర్ దగ్గర విజయలక్ష్మి డాన్స్ నేర్చుకుంది. ఎట్ లాస్ట్ 1979 లో ఇనాయె తడి అనే మళయాళ మూవీ తో విజయలక్ష్మి తెరంగేట్రం చేసింది. ఈ సినిమానే ఆమె పేరును మార్చేసింది. విజయలక్ష్మి స్మితగా మారింది. ఆ తరువాత వండిచక్రం అనే తమిళ మూవీలో స్మిత చేసిన సిల్కు పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతోనే విజయలక్ష్మి సిల్క్ స్మిత అయింది…

అదృష్టమో, దురదృష్టమో కాని ఫస్ట్ సినిమా ఇనాయె తడిలో స్మిత చేసిన సెక్స్ వర్కర్ క్యారెక్టర్ ఆమె ఫ్యూచర్ నే డిసైడ్ చేసింది. అప్పటిదాక వెండితెర చూడని కొత్త అందాలు. స్మిత అవకాశాలపై ప్రభావం చూపించాయి. హీరోయిన్ గా ప్రేక్షకుల మనుసుల్లో ఉండిపోవాలని సిల్క్ స్మిత అనుకుంది. కాని దర్శకులు మాత్రం మరోలా ఆలోచించారు. అప్పటికే జ్యోతి లక్ష్మీ, జయలక్ష్మిల ముదరు అందాలను చూసి ముఖం మొత్తిన అభిమానులు, సిల్మ్ స్మిత లేత సొగసులకు మనసు పారేసుకున్నారు. దీంతో స్మితకు అన్నీ వ్యాంప్ క్యారెక్టర్లే వచ్చాయి.1989లో వచ్చిన మళయాళి మూవీ లయనం సిల్క్ స్మితకు ఎరోటిక్ ఇమేజ్ ను తెచ్చింది. ఆ సినిమాలో బికినీలో కనిపించి అప్పటి కుర్రాళ్లకు ఎన్నో నిద్రలేని రాత్రుల్ని అంటగట్టింది స్మిత. వ్యాంప్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సిల్క్ చేసిన కొన్ని పాత్రలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. వసంత కోకిల అలాంటిదే. కమల్ హాసన్, శ్రీదేవిలతో సమానంగా సిల్క్ కు ఆ సినిమాతో పేరొచ్చింది.

సిల్క్ స్మిత ఓ క్రౌడ్ పుల్లర్. అరవై ఏండ్ల ముసలాడిదాక బతికి ఉన్న మగాళ్లందరిని సినిమా హాళ్లకు రప్పించిన సక్సెస్ మంత్రం. తన ఒక్క పాటతో సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసిన ట్రాక్ రికార్డ్ సిల్క్ స్మితది. అప్పటివరకు ఏ ఐటం గర్ల్ కు అలాంటి ట్రాక్ రికార్డ్ లేదు. రిలీజ్ కాని సినిమాల్లో సిల్క్ ఐటం సాంగ్ ను చొప్పించి లక్షలు సంపాదించిన నిర్మాతలు చాలామందే ఉన్నరు. ఆ జమానాలో సిల్క్ పాటలేని సినిమాను ఊహించడమే కష్టం.

సీతాకోక చిలుక తో సిల్క్ స్మిత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ వదిన పాత్రలో సిల్క్ నటన సూపర్బ్.ఎన్‌.టి.ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో నటించింది. యమకింకరుడులో చిరంజీవితో సిల్క్ చేసిన ఐటం సాంగ్ అప్పట్లో సూపర్ హిట్. హీరో ఎవరైనా సిల్క్‌ స్మిత డ్యాన్స్‌ ఉందా? లేదా? అని అడిగి మరీ సినిమాల్ని చూసే ప్రేక్షకుల్ని సంపాదించుకుంది. వసంతకోకిల, గూండా, హీరో, నాదేశం, అడవిసింహాలు, అభిమన్యుడు, రక్షణ, బావ- బావమరిది సినిమాల్లో సిల్క్ నటించింది. ముఖ్యంగా సుమన్‌ సినిమాల్లో వరుసగా ఐటం సాంగ్స్ చేస్తూనే కీరోల్స్ కూడా పోషించింది. ఇక తెలుగు సినిమా ఐటం సాంగ్స్ కు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన బావలు సయ్యా పాట సిల్క్ కెరీర్ లోనే నెంబర్ వన్ సాంగ్.

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ సిల్క్ స్మిత అందానికి దాసోహం అయిన వాళ్లకు లెక్కలేదు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేడి పుట్టించిన సిల్క్ కు అప్పటి సూపర్ స్టార్లు అట్రాక్ట్ అయ్యారు. రజనీకాంత్, కమల్ హాసన్, కృష్ణ, చిరంజీవి, సత్యరాజ్ లతో సినిమాల్లో సిల్క్ ఆడిపాడింది. అయితే వారిలో కొందరితో సిల్క్ కు రియల్ లైఫ్ అఫైర్స్ ఉన్నట్టు గాసిప్స్ ఉన్నాయి.

సిల్క్ స్మిత సినిమాల్లో వ్యాంప్ కావచ్చు. మగవాళ్లని ఆకర్షించే వగలాడి కావచ్చు. హీరోలతో అర్ధనగ్నంగా చిందేసి ఉండొచ్చు. తన చూపులతో, చేష్టలతో వెండితెరకు కిక్ ఎక్కించి ఉండొచ్చు. కాని అదంతా ఆన్ స్క్రీన్ ప్రొఫెషనలిజమే…తెర తీస్తే స్మిత జీవితంలో చీకటి కోణాలెన్నో… సిల్క్ లైఫ్ స్టోరీతో డర్టీ పిక్చర్ తీసి ఉండచ్చు. కానీ, స్కిల్ మాత్రం డర్టీ కాదు…