20 కోట్ల ఫేక్ అకౌంట్లా...  ఫేస్‌బుక్ - MicTv.in - Telugu News
mictv telugu

20 కోట్ల ఫేక్ అకౌంట్లా…  ఫేస్‌బుక్

February 5, 2018

నాణ్యమైన వస్తువుకు ధీటుగా నకిలీ వస్తువులు తయారు చేసినట్టుగానే ఫేస్‌బుక్‌లో కూడా నకిలీ అకౌంట్లు ఎక్కువయ్యాయి. ఈ దశ నానాటికి ముదురుతున్నదని ఫేస్‌బుక్ సంస్థ వెల్లడించింది. డిసెంబ‌రు 2017 నాటికి 20 కోట్ల న‌కిలీ ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయని పేర్కొన్నది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మొత్తం ఫేస్‌‌బుక్ ఖాతాల్లో దాదాపు 10 శాతం ఫేక్ అకౌంట్లని ఆ సంస్థ త‌న వార్షిక నివేదిక‌లో పేర్కొంది. అభివృద్ది చెందుతోన్న దేశాల్లోనే ఎక్కువ‌గా ఈ న‌కిలీ ఖాతాల వ్యాప్తి ఉన్న‌ట్లు నివేదిక‌లో బహిర్గతం చేసింది. అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి ఈ మధ్య చాలా మంది ఆకతాయిలు డబ్బున్న అబ్బాయిలను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఫేక్ ఖాతాల వల్ల చాలా మంది ప్రేమ పేరుతో, వ్యాపారాల పేరుతో, స్నేహాల పేరుతో మోసపోతున్నారని వాపోయింది.ఇండియా,  ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బ్రెజిల్ తదితర దేశాలలో నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్న‌ట్లు ఫేస్‌బుక్ సంస్థ తెలిపింది. ఈమేరకు డిసెంబర్ 2017తో ముగిసే నాలుగో త్రైమాసిక నివేదికలో ఎఫ్‌బీకి 213 కోట్ల‌ యాక్టివ్ ఖాతాదారులు ఉన్నట్లు పేర్కొంది. 31 డిసెంబర్ 2016తో పోలిస్తే యాక్టివ్ యూజర్ల సంఖ్య 14 శాతం పెరిగిందని వివరించింది. కాగా ఇండియా, వియత్నాం, ఇండోనేషియా దేశాల్లోని వ్యక్తుల వల్లే తమ ఖాతాదారుల సంఖ్యలో పెరుగుదల చోటుచేసుకుందన్నారు.  2017లో యాక్టివ్ యూజర్ల సంఖ్య పెరుగుదలకు కారణం ఇదేనని తెలియజేసింది. ఇలాంటి ఫేక్ అకౌంట్ల వల్ల తమ సంస్థకు చెడ్డపేరు వస్తున్నదని తెలిపింది. అలాంటి ఖాతాలను త్వరలోనే రద్దు చేస్తామని ఎఫ్‌బీ తెలిపింది.