200 కోట్లతో తూప్రాన్ వద్ద పరిశ్రమ  - MicTv.in - Telugu News
mictv telugu

200 కోట్లతో తూప్రాన్ వద్ద పరిశ్రమ 

October 16, 2017

తెలంగాణ రాష్ట్రానికి మరొక భారీ పెట్టుబడితో ఓ పరిశ్రమ రానున్నది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు కోల్‌కతా నగరంలో పలువురు బడా పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో 200 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనున్నట్లు అర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు తెలిపింది. సిద్దిపేట జిల్లాలోని తూప్రాన్ వద్ద సుమారు 20 ఎకరాల్లో పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా తమ ఈ –విటా, టూ- యమ్మీ బ్రాండ్లను ఇక్కడి నుంచి తయారు చేయనున్నారు. పుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో గోయాంక గ్రూప్ ద్వారా తెలంగాణ రైతులకు సహకారం అందించాల్సిందిగా మంత్రి కోరారు. తమ ఉత్పత్తులను మార్కెట్ ధరకు అమ్ముకునేలా స్థానిక ప్రాంతాల్లోనే రైతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు గోయేంకా గ్రూపు అంగీకరించింది.  తెలంగాణ ప్రభుత్వ విధానాలను, తెలంగాణ రాష్ర్టానికి ఉన్న బలాలను( అడ్వాంటేజ్) గుర్తించి 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన సంజీవ్ గోయేంకా గ్రూపుకు,కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సమావేశం తర్వతా శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ హేమంత్ కనోరియాతో కేటీఆర్ సమావేశం అయ్యారు. మౌళిక వసతుల రంగంలో భారీ పెట్టుబడులు కలిగిన గ్రూప్ తెలంగాణలో చేపట్టేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల గురించి వివరాలను అందజేశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చేపడుతున్న మౌళిక వసతులు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం తీసుకోవాలని కోరారు. దీంతోపాటు రాష్ర్ట ప్రభుత్వం పుడ్ పార్కుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందుకోసం ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్టీయల్ పార్కులకు అర్ధిక సహాకారం అందించే అవకాశాలను పరిశీలిస్తామని హేమంత్ కనోరియా తెలిపారు. మంత్రి సూచన మేరకు త్వరలోనే జపనీస్, చైనీస్, కోరియన్ పెట్టుబడిదారులతో తెలంగాణలో పెట్టుబడుల కోసం ఒక  సమావేశాన్ని హైదరాబాద్లో  ఏర్పాటు చేసేందుకు సహాకరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తమ వినూత్నమైన విధానాల ద్వారా రాష్ట్రంలోని పరిశ్రమలకు, రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు ఇచ్చే సహకారంపైన సుదీర్ఘంగా వివరించారు. ముఖ్యంగా మేక్ ఇన్ తెలంగాణ నినాదం ద్వారా మ్యాన్యూఫాక్చరింగ్ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు.