తెలంగాణలో 22 వేల పోలీస్ కొలువులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 22 వేల పోలీస్ కొలువులు

March 28, 2018

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీపి కబురు తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల పోలీస్ పోస్టుల భర్తీ చేయనుంది. ఇందులో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో 18 వేల పోస్టుల భర్తీకి మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది. జైళ్లు, అగ్నిమాపక శాఖ, ఎస్పీఎఫ్, ఆర్టీసీ విభాగాల్లో మరో 4 వేల పోస్టులు భర్తీ కానున్నాయి. మొత్తంగా చూస్తే, 22 వేల పోస్టుల భర్తీకి పోలీసు నియామక బోర్డు దశలవారీగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.  రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నోటిఫికేషన్ వెలువడుతుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


రిజర్వేషన్‌తో పాటు గత నోటిఫికేషన్‌లోని కొన్ని అంశాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉన్నందున తాజా నోటిఫికేషన్ కాస్త ఆలస్యమవుతోందని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా కానిస్టేబుల్ నుంచి  పైస్థాయి అధికారుల వరకు ప్రభుత్వం భారీగా పదోన్నతులు కల్పించడంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి ప్రస్తుత నోటిఫికేషన్‌లో భారీ సంఖ్యలో ఎస్సై పోస్టులను కేటాయించనున్నారు. పోలీసు అభ్యర్థుల శిక్షణా విధానంలో స్వల్ప మార్పులు చేయనున్నట్టు చెప్పారు. టెక్నికల్ సర్వీసెస్, కంప్యూటర్ టెక్నాలజీతో పాటు కమ్యూనికేషన్స్‌కు సంబంధించి అంశాలపై ప్రత్యేక సిలబస్ తయారు చేస్తున్నారు. ఇదిలావుండగా వయోపరిమితిలో సడలింపు విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.