ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువులు - MicTv.in - Telugu News
mictv telugu

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువులు

December 1, 2017

మిషన్ కాకతీయ నాలుగో దశలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువుల నిర్మాణానికి స్టేజ్ 1 అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబరు 930 , తేదీ 30.11.17 ద్వారా రూ. 92 కోట్ల నిధులను మంజూరు చేసింది.

భూసేకరణ తదితర చట్టపరమైన పనులను పూర్తి  చేయడానికి ఈ నిధులను వెచ్చిస్తారు. మొదటి దశలో పనులు పూర్తి అయిన తర్వాత చెరువుల నిర్మాణ పనుల కోసం అంచనాలు ప్రభుత్వ ఆమోదానికి పంపాలని ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్‌ని ఆదేశించింది. రెండో దశ పనుల ప్రతిపాదనలతో పాటూ మొదటి దశ కోసం మంజూరైన నిధుల వినియోగ పత్రాలను కూడా జత చెయ్యాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

మంజూరైన 26 కొత్త చెరువుల్లో ఆదిలాబాద్ నియోజక వర్గంలో 5, బోథ్ నియోజకవర్గంలో 10, ఖానాపూర్ నియోజకవర్గంలో 6, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 6 చెరువులు ఉన్నాయి. ఇక మండలాల వారీగా  చూసినప్పుడు బేల , తాంసీ, బోథ్, ఖానాపూర్, వాంకిడి , ఆదిలాబాద్, నేరెడిగొండ, తలమడుగు , జైనూరు, ఆసిఫాబాద్ మండలాల్లో ఒకటి చొప్పున , ఇచ్చోడా , గుడిహత్నూర్, ఇంద్రవెల్లి , నార్నూర్ మండలాల్లో 3 , కడం , కేరామేరి మండలాల్లో 2 చొప్పున ఉన్నాయి.

మిషన్ కాకతీయలో కొత్త  చెరువుల నిర్మాణానికి అనుమతిని మంజూరు చెయ్యడం ఇదే మొదటిసారి. ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయలో చేపట్టిన మూడు దశల్లో అద్భుతమైన పురోగతి కనిపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 2747 చెరువుల్లో మూడు దశలలో పునరుద్ధరణకు చేపట్టిన చెరువులు 1275. మిగిలిన 1472 చెరువుల్లో నాలుగో దశలో 378 చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.

అందులో 41 కొత్త చెరువులు, 3 ఆనకట్టల  నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ప్రభత్వ ఆమోదానికి పంపించామని నిర్మల్ సూపరిండెంట్ ఇంజనీర్  తెలిపారు. ఇదే విషయాన్ని సాగునీటి మంత్రి హరీష్ రావు  శాసన మండలిలో ఒక ప్రశ్నకు జవాబిస్తూ ధృవీకరించారు.

వీటిలో మొదటగా 26 కొత్త చెరువుల నిర్మాణానికి ఆమోదం లభించింది. మంత్రిగారు శాసన మండలిలో ఇచ్చిన హామీ ఇప్పుడు పాక్షికంగా నేరవేరినట్లయ్యింది. మిగతా చెరువులకు కూడా అనుమతి త్వరలోనే లభించే అవకాశం ఉన్నది.

వీటి కింద మొత్తం 25 వేల ఎకరాలు కొత్తగా సాగులోనికి వస్తాయి. గత మూడు దశల్లో ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్దరణ జరిగినందున ఇప్పటివరకు 71 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడినదని మైనర్ ఇరిగేషన్  చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ తెలిపారు. మొదటి దశలో 220.75 కోట్లతో చేపట్టిన పనుల్లో అన్ని పనులు పూర్తి అయినాయి. వీటి కింద 39 వేల ఎకరాలు స్థిరీకరించబడ్డాయని ఆయన అన్నారు.

రెండో దశలో 155.46 కోట్లతో చేపట్టిన 466 పనుల్లో ఇప్పటి వరకు 317 పనులు పూర్తయ్యాయని , వీటి కింద 32 వేల ఎకరాలు స్థిరీకరించబడ్డాయి. అలాగే మూడో దశలో 100.47 కోట్లతో  చేపట్టిన 252 పనుల్లో అన్నీ పనులు పురోగతిలో ఉన్నాయని, వచ్చే ఖరీఫ్  నాటికి వీటిని పూర్తీ చేసి 27 వేల ఎకరాలను స్థిరీకరిస్తామని సిఇ తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు మంత్రి హరీష్ రావు చొరవతో 80 కోట్ల వ్యయంతో పనులు చేపట్టి ఇప్పటి వరకు 25 వేల ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చామని సిఇ తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి మిగిలిన పనులు పూర్తి  చేసి మొత్తం 45 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.

జిల్లాలో జపాన్ ఆర్ధిక సహకారంతో చేపట్టిన 45 చెరువుల్లో 37 చెరువు పనులు 360 కోట్లతో  పూర్తి అయ్యాయని , ఫలితంగా 34 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు. జూలై 2017 నాటికి జపాన్ ఒప్పందం ముగిసినందున మిగతా పనులను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ప్రతిపాదిత 38,763 ఎకరాలకు సాగునీరు అందిస్తామని..

గడచిన మూడు సంవత్సరాల్లో మైనర్ ఇరిగేషన్‌లో  59,840 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయని, 1.30 లక్షల ఎకరాలు స్థిరీకరించాబడ్డాయని సిఇ శ్యాంసుందర్ తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువులకు మంజూరి ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నదని మంత్రి హరీష్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నీటి వనరులు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యం కారణంగా  అభివృద్దిలో వెనుకబడి పోయిందని మంత్రి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సర్వతో ముఖాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు. 26 కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక శాసన సభ్యులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు, ఇంజనీర్లకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.