తాను జుట్టుకు తెలుపు రంగు వేసుకుని శబరిమల ఆలయంలోకి ప్రవేశించానని పి.మంజు(36) అనే దళిత మహిళ తన ఫేస్బుక్లో రాసుకొచ్చింది. లోపలికి వెళ్లినట్టు వీడియో కూడా షేర్ చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె దిగిన ఫోటోలు నిజమైనవో కావో తేల్చే పనిలో పడ్డారు. తాను 50 ఏళ్ల మహిళలా కనిపించేందుకే ఈ పని చేశానని సంచలన ప్రకటన చేసింది. అయ్యప్పను దర్శించుకుంటున్న ఫొటోను కూడా పోస్టు చేసింది.‘నేను పోలీసుల రక్షణ కోరలేదు, ఇతర భక్తులతో కలిసే వెళ్లాను. 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నాను’ అని పేర్కొంది. గత అక్టోబరులో ఆలయంలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన 20 మంది మహిళల్లో మంజు కూడా వుంది. ఈ విషయం తెలిసిన ఆందోళనకారులు కొల్లాంలోని ఆమె ఇంటిపై దాడి చేశారు. తాజాగా మంజు ఫేస్బుక్ పోస్టుతో మరోమారు శబరిమలలో కలకలం రేగింది. ఇదిలావుండగా ఇటీవల శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారన్న వార్తలతో గతవారం కేరళ అట్టుడికింది. ఆ తర్వాత శ్రీలంకకు చెందిన శశికళ అనే మహిళ ఆలయంలోకి ప్రవేశించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.