మొసలి చనిపోతే ఓ ఊరుఊరుంతా కన్నీరు మున్నీరయ్యారు. ఏడ్చిఏడ్చి తుది వీడ్కోలు పలికారు. పాడెమీద 500 మంది గ్రామస్థులు ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. విచిత్రంగా వుందనిపించినా ఆ మొసలితో ఆ ఊరివాళ్లకున్న మమకారం, అటాచ్మెంట్ అలాంటింది మరి. ఈ ఘటన ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీమిత్రా జిల్లా బవామొహత్రా గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… ఆ మొసలికి గ్రామస్థులందరూ కలిసి ముద్దుగా గంగారాం అని పేరు పెట్టుకున్నారు. మూడు మీటర్ల పొడవున్న దాని వయసు 130 ఏళ్ళు. అది గ్రామంలోని కుంటలో నివాసం వుండేది. కుంట పక్కన పిల్లలు ఆడుకుంటున్నా ఇంత వరకు అది ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదని గ్రామస్థులు విలపిస్తూ దానితో తమకున్న జ్ఞాపకాలను వల్లివేసుకున్నారు.తమ గ్రామంలోని కుంటలో పిల్లలు ఈదుతుంటే అందులో ఉన్న మొసలి మరో వైపునకు వెళ్లేదని వీర్ సింగ్ దాస్ అనే గ్రామస్థుడు చెప్పారు. తాము వడ్డించే అన్నం, పప్పును మాత్రమే తినేదని, అది శాఖాహారి అని తెలిపారు. మొసలి వల్ల తమ గ్రామానికి మగర్ మచ్చావాలా గామ్ అనే పేరు వచ్చిందని గ్రామ సర్పంచ్ మోహన్ చెప్పారు. ఇన్నేళ్ల నుంచి తమ ఊరితో అనుబంధం ఏర్పరుచుకున్న మొసలి చనిపోవడంతో వారంతా తమ ఆత్మ బంధువే చనిపోయిందని బాధపడ్డారు.
మొసలి మరణించిందనే సమాచారంతో అటవీశాఖ అధికారులు పశుసంవర్ధకశాఖ వైద్యులను పిలిపించి దాని కళేబరానికి పోస్టుమార్టం జరిపించారు. అనంతరం మొసలి కళేబరాన్ని గ్రామస్థులకు అప్పగించారు. వారు అంత్యక్రియలు జరిపించారని అటవీశాఖ అధికారి ఆర్కే సిన్హా చెప్పారు. మొసలి కళేబరానికి పూలమాలలు వేసి, ట్రాక్టరుపై ఊరేగించిన గ్రామస్థులు తుది వీడ్కోలు పలికారు.
మరణించిన మొసలికి గుర్తుగా గ్రామంలోని కుంట పక్కనే దాని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు ఆ గ్రామస్థులు.