తెలుగు మహాసభల్లో తనికెళ్ళ భరణి  గేయం... - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు మహాసభల్లో తనికెళ్ళ భరణి  గేయం…

December 17, 2017

 

బంగారు తెలంగాణ కలవడ్డది బిడ్డ

బాంచెన్ నీ కాల్మొక్త పాయె బొందలగడ్డ

తెలంగాణ మట్టి నువ్వు ముట్టిజూస్తె నెత్తురు

మన్నుల కన్నీరు కలిపి పూసుకుంటె అత్తరు

 

ఎంత గతం ఉండె మనకు ఎంత ఖతం చేసిరి

సంస్కృతిని కాలవెట్టి నోట్లెమన్నువోసిరి

ఒక్కసారి తల్చుకుంటె జాతి ఖులాయిస్తది

గుండెల నెత్తుటి జెండా లేచి ఖిలాయిస్తది

శాతవాహనులు నాటిన తెలంగాణ మొక్క

ఊడలేసుకుంట వెరిగె మర్రిచెట్టులెక్క

ఎన్ని పక్షులొచ్చి వాలిన ఇచ్చెను జాగ

గుబులైతది తిన్నపిట్ట రెట్టలేసి పోగ

 

కాకతీయ సామ్రాజ్యపు రుద్రమాంబ కత్తి

తెలంగాణ పౌరుషాన్ని చాటెను చెయ్యెత్తి

మొట్టమొదటి రాజధాని ఆ హనుమకొండ

వెయ్యిస్తంభాలు మొలిచె శిల్పాల ఉలిగొండ

 

కళలు,కత్తులు కలగలిపిన ఊరు ఓరుగల్లు

పేరణి శివతాండవాల గజ్జెల ఘలుఘల్లు

రాతిని పువ్వుగ జెక్కిన రామప్పకు సాటి

నాగిని శిల్పాలకు దున్యాల లేదు పోటి

 

పాలుగారు తెలంగాణ పసిడి తెలంగాణ

పాపం పుణ్యం ఎరుగని పసిది తెలంగాణ

పచ్చని చేలు పొలాలు కోటబావి జలాలు

చెరువులు చెలకలు కుంటలు దుక్కిదున్ను పొలాలు

 

మొదటిసంది ఓరుగల్లు హోరు పోరుగల్లు

తరతరాల బానిసకు తెంపెను సంకెళ్ళు

ఈతపళ్లు తాటికల్లు ఎగిరె పాలపిట్టలు

జొన్న రాగి సంగటి ముత్యాల మక్కబుట్టలు

 

మామ బావ కాక అలయ్ బలయ్ ఆటలు

అక్క అత్త ఆడిబిడ్డ మురుసుకుంట పాటలు

జాతరొస్తె డప్పుమోత ఊగు పోతరాజులు

బతుకమ్మ పండుగళ్ల బంతిపూల జాజులు

 

పాణాలను పణంబెట్టి పెయ్యి కాలవెట్టి

అమరుల త్యాగాలు ముట్టె తెలంగాణ మట్టి

గులాబీల దళమొస్తది గుండెలల్ల వంటది

ప్రేమకు పరిమళమిస్తది ద్రోహుల ముల్లు గుచ్తది

బంగారు తెలంగాణ కలతీరెను బిడ్డా..

కేసీఆర్ వచ్చిండిక అభివృద్ధికి అడ్డా?

# తనికెళ్ళ భరణి