పుట్టినరోజునాడే..పాడెక్కిచ్చిన  కీచకులు - MicTv.in - Telugu News
mictv telugu

పుట్టినరోజునాడే..పాడెక్కిచ్చిన  కీచకులు

December 4, 2017

రాను రాను మనుషులు ఎంత దారుణంగా తయారవుతున్నారో జయశంకర్ భూపాల్ పల్లిజిల్లాలో జరిగిన సంఘటన చూస్తే అర్థమవుతుంది. జిల్లాలోని  రేగొండ మండలం గోరి కొత్తపల్లిలో ఏడేళ్ల చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత చంపేశారు. రాజు, ప్రవళికల కూతురు రేష్మ.. నిన్న సాయంత్రం.. గల్లీలో జరుగుతున్న  పెళ్లి ఊరేగింపు వద్దకు వెళ్ళింది.

అయితే  అదే రోజు రేష్మ పుట్టినరోజు కావడంతో రాత్రి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నారు పాప తల్లిదండ్రులు. కానీ రాత్రి అయినా కూడా తమ బిడ్డ ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చిన్నారికోసం చుట్టుప్రక్కల వెతికారు. అయినా పాప ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంతలో చేదులాంటి వార్త వారి చెవిన పడింది. తమ కూతురు దారుణంగా హత్యాచారానికి గురై పొలాల్లో ఉందని స్థానికులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితులకోసం గాలిస్తున్నారు.