టీఎస్ఎఫ్‌డీసీ లోగో రూపకర్తగా ధని ఏలెకు అదుదైన గౌరవం - MicTv.in - Telugu News
mictv telugu

టీఎస్ఎఫ్‌డీసీ లోగో రూపకర్తగా ధని ఏలెకు అదుదైన గౌరవం

April 20, 2018

తెలుగు చిత్రసీమలో ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలెకు మరో గౌరవం దక్కింది.తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్‌డీసీ) లోగోను రూపొందించే అవకాశాన్ని ఆయన దక్కించుకున్నారు. అచ్చమైన పల్లె భువనగిరి జిల్లా కదిరేణిగూడెంకు చెందిన ధనుంజయ ఏలె సినిమా రంగంలో ధని ఏలెగా మారి సృష్టించిన ఈ లోగోలో నూతన తెలంగాణ రాష్ట్ర ఆత్మ ఆవిష్కృతమైంది. వంద కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా అయినా మొదట తన ప్రత్యేకతను చాటుకునేది పోస్టర్ లుక్‌తోనే. సినిమా టైటిల్ అయినా, పోస్టర్ అయినా ధని ఏలె రూపొందిస్తే ఎన్నో ప్రత్యేకతలను అది సంతరించుకుంటుంది. అలా తనదైన ముద్రతో మెప్పించి ధని ఏలె తన సినీ ప్రయాణంలో సుమారు 250 సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు ఇతర భాషల సినిమాలు ఉండటం విశేషం. అటువంటి ధని ఏలె తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు లోగో రూపొందించడమంటే సినిమా రంగానికి దక్కిన ప్రత్యేక గౌరవంగానే చెప్పుకోవచ్చు.

ఎన్నో ప్రత్యేకతలున్న లోగో :

సినిమా రంగ గత, వర్తమాన, భవిష్యత్ కాలాలను లోగోలో ధని ఏలె దర్శింపజేయటం విశేషం. లోగో ఆద్యాంతం కొత్త జీవాన్ని అందిస్తోంది. క్లాప్ బోర్డులో పాలపిట్ట అనే వైవిద్యాన్ని చూపించిన చిత్రకారుడు ధనిఏలె. క్లాప్ బోర్డును సినిమాకు ప్రతీకగా, పాలపిట్టను నూతన తెలంగాణలో సృజనాత్మక ఆలోచనల ఆవిష్కరణకు ప్రతిబింబంగా వుంచారు. ఇక గులాబీ రంగులో ఉన్న ఆ పాలపిట్ట తెలంగాణ ప్రజల నిష్కల్మషమైన ప్రేమకు, విశ్వాసానికి చిహ్నంగా నిలిచింది. పాలపిట్ట నీలంరంగు రెక్క సృజనాత్మకతకు, ఆకుపచ్చని రంగు తెలంగాణ చిత్ర పరిశ్రమ సస్యశ్యామలంగా వర్థిల్లాలనే ఆకాంక్షకు చిహ్నంగా కనిపిస్తూ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ధని ఏలెకు ప్రముఖుల ప్రశంసలు :తెలంగాణ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ లోగోతో సృజనాత్మకత సస్యశ్యామల ఆకాంక్షను వెల్లడి చేసిన లోగో రూపకర్త ధని ఏలెకు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. టీఎస్ఎఫ్డీసీ ఛైర్మన్ రామ్మోహనరావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐ అండ్ పి ఆర్ కమీషనర్ అరవింద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి వంటి ప్రముఖులు ధని ఏలె ప్రతిభను కొనియాడారు. కాగా బుధవారం లోగోను టీఎస్ఎఫ్‌డీసీ ఛైర్మన్ రామ్మోహనరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు నాగయ్య కాంబ్లే, అడిషనల్ డైరెక్టర్ కిశోర్ బాబు, మేనేజర్ విజయ్ హాజరై ధని ఏలెను ప్రత్యేకంగా ప్రశంసించారు.