స్టూడెంట్ నంబర్ 1.. జైల్లో సివిల్స్‌కు ప్రిపరేషన్

ఎన్టీఆర్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘స్టూడెంట్‌ నెం1’ సినిమా తరహా సంఘటన ఒకటి హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ సినిమాలో ఆదిత్య (ఎన్టీఆర్‌) చేయని తప్పుకు జైలులో శిక్ష అనుభవిస్తూ ‘లా’ చదివి తండ్రి కోరికను తీరుస్తాడు. కొంచెం అటూ ఇటూగా నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనే సిమ్లాకు చెందిన 27 ఏళ్ల విక్రమ్‌ సింగ్‌ జీవితంలోను జరిగింది.Telugu News A himachal pradesh resident prepared for civils in jailఅత్యాచార కేసులో స్థానిక సెషన్స్‌ కోర్టు అతడికి జైలుశిక్ష విధించింది. దీంతో తన సివిల్స్‌ కల చెదిరిందనుకున్నాడు. కానీ ఓ వైపు తాను నిర్దోషినంటూ హిమాచల్‌‌ప్రదేశ్‌ హైకోర్టులో పోరాటం చేస్తూనే మరోవైపు జైలులోనే సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. విక్రమ్‌ సింగ్‌ కృషి , పట్టుదల, నమ్మకంతో సగం విజయం సాధించాడు. హైకోర్టు అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పును వెలువరించింది. దీంతో జైలునుంచి విడుదలైన విక్రమ్ సింగ్ తరువాతి లక్ష్యం సివిల్స్‌ సాధించడమే అని తెలిపాడు.

ఒకవైపు జైల్లో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు నిరుద్యోగుల కోసం ‘కాంపిటీషన్‌ కంపెనియన్’ అనే మ్యాగజిన్‌ను కూడా రూపొందించాడు విక్రమ్. అలాగే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మాదకద్రవ్యాల మీద పోరాటం చేస్తానని తెలిపాడు. జైల్లో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ కావడానికి అలాగే మ్యాగజైన్ రావడానికి సహకరించిన జైళ్ల శాఖ డీజీ సోమేశ్ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అయితే విక్రమ్ సింగ్ తయారు చేసిన మ్యాగజిన్ విడుదల కావడం సంతోషంగా ఉందని సోమేశ్ గోయల్ పేర్కొన్నాడు.