‘కబాలి’ ఆదర్శంతో  రౌడీషీటర్ బర్త్‌డే ! - MicTv.in - Telugu News
mictv telugu

‘కబాలి’ ఆదర్శంతో  రౌడీషీటర్ బర్త్‌డే !

February 7, 2018

కబాలి ’ సినిమాలో లాగ హత్యకు ప్లాన్ చేశారు రౌడీ షీటర్లు. పోలీసుల రంగప్రవేశంతో వారి ప్లాన్ బెడిసికొట్టిన సంఘటన చెన్నైలో చోటు చేసుకున్నది. చెన్నై సిటీలో పేరుమోసిన రౌడీషీటర్ బిను మంగళవారం రాత్రి మలయంబాక్కంలోని పున్నంమల్లే ప్రాంతంలోని తోటలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు.

తన పుట్టినరోజు సందర్భంగా సిటీలో పేరుమోసిన రౌడీలందరినీ  బిను ఆహ్వానించాడు. ఇదే వేడుకలో హాజరయ్యే ప్రముఖ రౌడీ రాధాక్రిష్ణన్‌ను కబాలి సినిమా స్టైల్‌లో అక్కడే హత్య చెయ్యాలని పక్కా ప్లాన్ వేశారు. అయితే రౌడీషీటర్ రాధాక్రిష్ణన్ అక్కడకు రాకపోవడంతో అతని ప్రాణాలు మిగిలాయని పోలీసులు వివరించారు.

వివరాల్లోకి వెళ్తే.. బిను పుట్టిన రోజు వేడుకలకు రెండు కార్లలో 72 మంది రౌడీ షీటర్లు బయలుదేరి వెళ్లారు. అంత మంది ఒకేసారి రెండు కార్లలో బయలుదేరిన విషయం తాంబరం పోలీసుల కంటపడింది. ఎవరినైనా చంపడానికి వెలుతున్నారా అని పోలీసులకు అనుమానం వచ్చింది. అంతే పోలీసు జీపు పక్కన పెట్టి ట్రంక్‌లో కార్లను వెంబడిస్తూ సిటీలోని పోలీసులందరికీ సమాచారం ఇచ్చారు. మలయంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కారు షెడ్‌లోకి రెండు కార్లు వెళ్లడం గమనించారు పోలీసులు. తరువాత రౌడీలు తోటలో బిను బర్త్‌డే పార్టీలో బిజీ అయిపోయారు. బిను ప్లాస్టిక్ కత్తితో కాకుండా మటన్ నరికే కత్తితో కేక్ కట్ చేస్తున్న సందర్భంలో, పోలీసులు అదనపు బలగాలను పిలిపించి, ఒక్కసారిగా వెళ్లి వాళ్ళను చుట్టుముట్టారు.

పోలీసులు రావటంతో రౌడీలందరూ చాకచక్యంగా తప్పించుకు పారిపోయారు. కానీ పోలీసులు వాళ్లను వదిలి పెట్టలేదు. ప్రత్యేక బృందాలు చెన్నై నగర శివార్లలోని గ్రామాల్లో గాలించి బినుతో సహ 72 మంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. నిందితులను చెన్నైలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించి విచారణ చేపట్టారు. విచారణలో వారు రాధాక్రిష్ణన్‌ను చంపటానికి పథకం రచించినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం. వారి దగ్గర మారణాయుధాలు, మొబైల్ ఫోన్లు, 8 కార్లు, 32 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.