ఫోటో గ్రాఫర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ఫోటో గ్రాఫర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే

April 13, 2018

ఈనాడు ఫోటోగ్రాఫర్ ఉద్యోగం తీయించాడు. రెండు రోజులు జైలులో పెట్టించాడు. ఎవరా ఎమ్మెల్యే ? అధికారం చేతిలో వుంది కదా అని కొందరు నాయకులు ప్రజలతో చాలా దురుసుగా వ్యవహరిస్తుంటారు. ఎన్నికల ముందు పిల్లిలా ఇల్లిల్లూ తిరిగిన నాయకులు ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి తర్వాత పులులుగా మారి ఆ ప్రజల మీదకే గాండ్రిస్తుంటారు. అలాంటి ఓ ఘటనే కామారెడ్డిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి అనడానికి ఇది నిదర్శనం. రోజుకో నేత ఆగడాలు బయటపడుతున్నాయి. అయినా ఎవరూ స్పందిచడం లేదు. తాజాగా కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అరాచకం వెలుగు చూసింది. మిషన్ కాకతీయ పనుల పేరుతో తన బంధువుల భూమిని కబ్జా చేశారంటూ ఈనాడు సంస్థకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతను నోరు జారాడట.

సదరు ఎమ్మెల్యే అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులతో అతణ్ణి బెదిరించే ప్రయత్నం చేశారు. తనకే ఫిర్యాదు చేస్తావా అంటూ నానా మాటలు అన్నాడు. అంతే కాకుండా అధికార మదంతో అనుకోకుండా నోరు జారిన బాధితుడిని రెండు రోజుల పాటు పోలీసుల అదుపులో ఉండేలా ఒత్తిడి తీసుకువచ్చాడు. అంతే కాకుండా నువ్వు రిపోర్టర్ అయితే ఏం చేస్తావ్ ఏమి చెయ్యలేవ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా వుండగా ఈనాడు సంస్థ సదరు ఫోటోగ్రాఫర్‌ను విధుల నుంచి తొలగించడం గమనార్హం. తాజాగా బయటపడిన ఈ వీడియో టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.