మరో ప్రాణం తీసిన ఆధార్.. - MicTv.in - Telugu News
mictv telugu

మరో ప్రాణం తీసిన ఆధార్..

February 3, 2018

ఎందుకూ కొరగాని నిబంధనల వల్ల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ. రేషన్‌ బియ్యానికి ఆధార్‌ కార్డుకు ముడి పెట్టడంతో జార్ఖండ్‌లోని పకూర్‌ జిల్లా ధావడంగల్‌ గ్రామంలో లుఖీ ముర్ము అనే 30 ఏళ్ల యువతి బలైంది. ఆధార్‌ కార్డుతో రేషన్‌ కార్డును అనుసంధానం చేయకపోవడంతో గత అక్టోబర్‌ నెల నుంచి బియ్యం, ఇతర సరకులు ఆమెకు ఇవ్వడంలేదు. దీంతో పస్తులుండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆకలితో అలమటించి జనవరి 27న మరణించింది. దీనిపై దర్యాప్తు జరిపిన ‘ రైట్‌ టు ఫుడ్ ‘ సంస్థ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం తమ నివేదికను విడుదల చేశారు. కాగా లుఖీ ముర్ము ఆకలితో చావలేదని, అంతుచిక్కని వ్యాధితో బాధ పడుతూ చనిపోయిందని జిల్లా పౌర సరఫరాల అధికారి దిలీప్‌ కుమార్‌ తెలియజేస్తున్నారుఇదిలా వుండగా జార్ఖండ్‌లో గత సెప్టెంబర్‌ నెలలో 11 ఏళ్ల సంతోషి కుమారి మరణించగా, ఇప్పటి వరకు ఏడుగురు మరణించారని ‘రైట్‌ టు ఫుడ్‌’ కార్యకర్తల నివేదిక వెల్లడిస్తోంది. దాంతో జార్ఖండ్‌ పౌర సరఫరాల మంత్రి అంతకుముందు ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అయినప్పటికీ రద్దయిన రేషన్‌ కార్డులను పునరుద్ధరించ లేకపోవడం వల్ల ఆకలి మరణాలు ఆగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.