యాసిడ్‌తో కాల్చేసినా.. వన్నెతగ్గని ఆత్మసౌందర్యం - MicTv.in - Telugu News
mictv telugu

యాసిడ్‌తో కాల్చేసినా.. వన్నెతగ్గని ఆత్మసౌందర్యం

March 8, 2018

‘మేం అదంగా పుట్టాం.. మాది అందమైన మనసు.. మేమెప్పటికీ అందంగానే బతుకుతాం.. ఈ ప్రపంచాన్ని కూడా అందంగా చూడాలనుకుంటాం.. మధ్యలో మాపై ఎలాంటి దారుణాలు జరిగినా మా అంతస్సౌందర్యం అందంగా వికసిస్తూనే వుంటుంది..’  అంటూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాసిడ్‌దాడి బాధితురాళ్లు ముంబైలో ర్యాంప్‌వాక్ చేశారు.

సమాజంలో మితిమీరిపోతున్న నేరాలను ఆపడానికి, యాసిడ్ అక్రమ విక్రయానికి వ్యతిరేక ప్రచారంలో భాగంగా వారు ఈ ర్యాంప్‌వాక్ చేశారు. అనేకమంది మహిళలు యాసిడ్‌దాడుల వల్ల ప్రాణాలతో పోరాటం చేస్తున్నారని యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ అన్నారు. ఆమె 2005లో యాసిడ్ దాడికి గురైనట్టు తెలిపారు.

‘ఈ పదమూడేళ్ళ కాలంలో నేను అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. తమ ప్రేమను తిరస్కరించిందనో, అమ్మాయి ఇంకొక అబ్బాయితో స్నేహంగా వుంటోందనో ఏదేదో ఊహించుకుని అమ్మాయిల మీద అన్యాయంగా యాసిడ్ దాడులకు పాల్పడి వారి జీవితాలతో ఆడుకోవద్దు ’ అన్నారు. పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వస్తే ఇలాంటి దాడులను పూర్తిగా అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. యాసిడ్ బాధితులకు కూడా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్నారు. యాసిడ్ దాడుల బాధితులకు కోర్టులు తొందరగా న్యాయం చేయాలని పేర్కొన్నారు. మహిళల భద్రత గురించి అవగాహన కల్పించడం న్యాయంకోసం వారికి మార్గాలను సృష్టించడం వంటి కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు.