తల్లీబిడ్డల  అనురాగంపై పాక్ యాడ్.. చూస్తే మీరూ ఫిదా.. - MicTv.in - Telugu News
mictv telugu

తల్లీబిడ్డల  అనురాగంపై పాక్ యాడ్.. చూస్తే మీరూ ఫిదా..

March 5, 2018

తల్లీబిడ్డల అనుబంధం ఎంతో తియ్యనైంది. అమ్మ త్యాగాలు బిడ్డల ఎదుగుదలలో ప్రేమను పరివ్యాప్తం చేస్తుంటాయి. తల్లి ప్రేమకు బిడ్డలు వెలకట్టలేరు. తిరిగి ఆమెను అంతే ప్రేమించగలిగితేనే ఆ ప్రేమను వెలకట్టినట్టు అవుతుంది. ప్రేమకు ప్రేమే బదులు.. అప్పుడే ఆ  బంధం మరింత బలోపేతం అవుతుంది. మారుతున్న జెనరేషన్‌లో అమ్మ కూడా ఉద్యోగరిత్యా బిజీ అయిపోయింది. ఈ క్రమంలో బిడ్డలకు తల్లి ప్రేమ కూడా కరువౌతోంది. తల్లి ఎంత బిజీగా వున్నా బిడ్డ గురించి ఆలోచిస్తుంది.. తన మధురమైన ప్రేమలో కొంచెం కూడా చప్పదనాన్ని రానివ్వదని ఈ టీవీ ప్రకటన చెబుతోంది.

పాకిస్థాన్‌కు చెందిన ‘ కేక్ అప్ ’ అనే చిరుతిళ్ల సంస్థ తమ ఉత్పత్తులపై ఈ యాడ్‌ రూపొందించింది. నాలుగు నిమిషాల్లో తల్లీకొడుకుల అనుబంధాన్ని అవిష్కరించారు. అప్పట్లో సామ్‌సంగ్ యాడ్ చాలా మందిని ఆకర్షించింది. దాని మాదిరే ఈ యాడ్ కూడా సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంటోంది.. కదిలిస్తోంది.. ఆలోచింపజేస్తోంది.. అనుబంధాల తీపిని పంచుతోంది.. ఆప్యాయతానురాగాల తడిని తట్టి లేపుతోంది.. ఈ అనురాగాలు ఎప్పటికీ మాసిపోవు, కాలం మారి పరుగెత్తుతుంటే దాని కాళ్ల కింద ప్రేమ, అనుబంధం ఎప్పటికీ నలిగిపోవు, నశించిపోవు అని చాటి చెబుతోంది ఈ యాడ్.

అందులో వృత్తిపరమైన ఓ మహిళ అటు డాక్టర్‌గా, ఇటు ఇంటి బాధ్యతలను కూడా సమానంగా మోస్తుంటుంది. ఒక రోజు ఆమె భర్త, కుమారుడికి అన్నీ సిద్ధం చేసి హాస్పిటల్‌కు రెడీ అవుతుండగా ఆమె కొడుకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే అప్పటికే ఆలస్యమవడంతో కొడుకు చెప్పేది వినిపించుకోకుండా అతడికి లంచ్‌‌బాక్స్‌ ఇచ్చేసి ఆమె హడావుడిగా బయల్దేరి వెళ్ళిపోతుంది. తల్లి అలా వెళ్లిపోవటంతో మనసు చిన్నబుచ్చుకుంటాడు ఆ చిన్నారి.

స్కూల్లో కూడా అమ్మ తన మాటను పట్టించుకోలేదని ఆలోచిస్తుండగా, ఓ విద్యార్థి వచ్చి ‘ నీకింకొక లంచ్‌బాక్స్ వచ్చింది ’ అని ఇచ్చి వెళ్లిపోతాడు. దాన్ని తెరిచి చూస్తే అందులో తనకు ఇష్టమైన కేక్‌ ఉంటుంది. ఆ కేక్‌నే పెట్టమని తల్లిని అడగాలనుకుంటాడా చిన్నారి. కేక్‌ను చూడగానే ఆనందంతో మురిసిపోతాడు. అయితే కేక్‌తో పాటు ఓ పేపర్‌ కూడా ఉంటుంది. అందులో.. ‘ నేనెంత బిజీగా ఉన్నా సరే.. నీ మాటలు వినే టైం నాకుంటుంది. నీకేం కావాలో తెలుసుకుంటూనే ఉంటాను ’ అని రాసి ఉంటుంది. ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతాడు చిన్నారి.

అలా ప్రతిరోజు ఆ అబ్బాయికి ఇంటినుంచి వచ్చే బాక్సులో కేక్, అమ్మ రాసిన అమృతాక్షరాలు వుంటాయి. ఓరోజు స్కూల్లో ఆ అబ్బాయి ఇంకొక అబ్బయితో పోట్లాడుతాడు. ఆరోజు బాక్సులో అమ్మ కేకుతో పాటు ఆ అబ్బాయికి క్షమాపణ చెప్పమని కోరుతుంది. తల్లి చెప్పినట్టు ఆ బాబుకి క్షమాపణ చెప్పి మితృణ్ణి గుండెలకు హత్తుకుంటాడు. రోజులు గడుస్తుంటాయి.. ఇలా తనకోసం ఇంత చేస్తున్న తల్లిని ఒకరోజు ఆ చిన్నారి ఆశ్చర్యపరుస్తాడు. అది చూసిన తల్లి కళ్లు ఆనందంతో నిండిపోతాయి. ఆ రోజు ఆమె లంచ్‌ బాక్స్‌ తెరవగానే అందులో సగం కేక్‌ ముక్క ఉంటుంది. దాని కింద ‘ అమ్మా నువ్వే చెప్పావుగా.. పంచుకుంటే ఆనందం రెట్టింపవుతందని ’ అని రాసిన పేపర్‌ ఉంటుంది. తల్లి ఆనందంతో ఉప్పొంగిపోతుంది.

పిల్లలకు కన్నవాళ్ళు ఏది పంచితే వాళ్లు భావితరాలకు అదే పంచుతారని అంతర్లీనంగా అద్భుతమైన సందేశం ఇచ్చారు ఈ యాడ్ ద్వార. చాలా మందిని ఆకట్టుకున్న ఈ యాడ్ ఇప్పటికే కోటి వ్యూస్ దాటింది. చాలా బాగుంది.. మంచి కాన్సెప్ట్.. మంచి సందేశమిచ్చిన యాడ్ అని కామెంట్లు చేస్తున్నారు.