కొడుకుతో కలసి 10వ తరగతి పరీక్షలు.. అమ్మకు జేజే! - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకుతో కలసి 10వ తరగతి పరీక్షలు.. అమ్మకు జేజే!

March 29, 2018

పెళ్ళి అయిపోతే ఆడపిల్లలు అన్నీ వదులకోవాల్సిందే. ఆ వదులుకోవడాల్లో చదువే ముందుంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ చదువుకున్న అమ్మాయిలు, ఎక్కువ చదువుకున్న అమ్మాయిలు బాధపడాల్సిందే. పెళ్ళయ్యాక ఆడవాళ్ళకు ఇల్లు, పిల్లల బాధ్యతలు మీద పడటంతో ఇక ఆమె ఉన్నత చదువులు చదువుకోలేదు. ఇది చాలా ఇళ్ళలో జరుగుతున్న వాస్తవం. అయ్యో మా కోడలు తక్కువ చదువుకుందని ఉన్నత చదువులు చదివించరు మెట్టినింటివాళ్ళు. అలాగని ఎక్కువ చదువుకున్న కోడలిని నెత్తిన పెట్టుకొని ఊరేగదు అత్తారిల్లు. కానీ పంజాబ్‌లోని లూధియానాకు చెందిన 44 ఏళ్ల రజినీ బాలా అనే మహిళ మాత్రం మెట్టినింటికెళ్ళాక తన 10 వ తరగతి పరీక్ష రాసింది. చదువు మానేసిన 29 ఏళ్ల తర్వాత 10 వ తరగతి పరీక్ష రాయడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ముగ్గురు పిల్లలకు తల్లి అయి కూడా పరీక్ష రాసింది.

పంజాబ్‌లోని లూధియానాకు చెందిన రజినీ బాలా 1989లో తొమ్మిదో తరగతి పూర్తి చేశారు. అనంతరం కొన్ని కారణాలతో అక్కడితో చదువు మానేశారు. పెళ్లి అయిపోయింది. చకచకా ముగ్గురు పిల్లలకు తల్లి కూడా అయింది.  ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు అటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఓ మీడియా సంస్థతో రజనీ మాట్లాడుతూ.. ‘ నా భర్త, పిల్లల ప్రోత్సాహం వుండబట్టే నేను ఈ పరీక్షలు రాశాను. నా ఈ విజయం వెనుక వాళ్ళే వున్నారు. మా ఆయన పదేపదే నన్ను 10 వ తరగతి పరీక్ష రాయమని పోరారు. నాకిప్పుడెందుకు చదువు అనుకున్నాను. కానీ ఆయన అతి బలవంతం మీద ఒప్పుకొని మళ్ళీ పుస్తకం పట్టుకొని చదవటం ప్రారంభించాను.

అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోన్న నాకు కనీసం పదో తరగతి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాను. నా కొడుకుతో కలిసి నేను కూడా చదవడం మొదలుపెట్టాను. మేమిద్దరం పాఠశాలకు కలిసి వెళ్లేవాళ్లం, కలిసి చదువుకునేవాళ్లం. మా అత్తగారు చదువుకోకపోయినప్పటకీ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. పరీక్షల సమయంలో నా భర్త నన్ను, నా కొడుకుని ఉదయాన్నే నిద్ర లేపేవారు. నా కూతురు కూడా నాకు ఎంతో సహకరించింది ’ అని ఎంతో ఆనందంగా చెప్పింది రజనీ.

చేసుకున్నవాడు గుణవంతుడు అవటం వల్ల తాను ఈ పరీక్ష రాశానని గర్వంగా చెబుతోంది ఆమె. రజనీ భర్త రాజ్ కుమార్ సాథి కూడా 17 ఏళ్ళ విరామం తర్వాత తన డిగ్రీ పూర్తి చేశాడు. తను డిగ్రీ పరీక్షలు రాయగా తన భార్య ఎందుకు రాయకూడదనుకున్నాడు. అంతే భార్య చేత 10వ తరగతి పరీక్షలు రాయించాడు. ఒక ఆడదాని విజయం వెనుక మగాడు కూడా వున్నాడని నిరూపించాడు.