భారతీయులకు అగ్ర మోజు తగ్గుతోంది - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులకు అగ్ర మోజు తగ్గుతోంది

March 14, 2018

అమెరికా అమెరికా ’ అంటూ కలలు కంటున్న భారతీయుల ఆశలమీద నిప్పులు చల్లాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఆ దేశానికి ఉన్నత చదువులకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అమెరికన్లకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్న క్రమంలో అక్కడ జాతి వివక్ష కూడా బుసలు కొడుతోంది. గడచిన రెండేళ్ళలో చాలామంది భారతీయులు జాతివివక్షకు గురై మరణించారు.

ఈ క్రమంలో అమెరికాకు వెళ్లే భారత్, చైనా విద్యార్థుల సంఖ్య బాగా పడిపోయింది. అక్కడికి వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య 27 శాతం తగ్గింది. 2016 సంవత్సరంలో 65, 257 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వీసాలు దక్కించుకుంటే, 2017లో మాత్రం 47, 302 మంది మాత్రమే పొందారు. కాగా అమెరికా విడుదల చేసిన గణాంకాల ప్రకారం… 2016తో పోలిస్తే 2017 సెప్టెంబరు 30 నాటికి విదేశీ విద్యార్థుల సంఖ్య 16 శాతం తగ్గిపోయినట్టు వెల్లడయ్యింది. 2016లో 5.02 లక్షల మంది విద్యార్థులు వీసాలు పొందితే, 2017లో ఈ సంఖ్య 4.21 లక్షలకు పడిపోయిందని అమెరికా నివేదిక స్పష్టం చేసింది.

గత కొన్నేళ్లుగా అమెరికా స్టూడెంట్ వీసాలు పొందే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2015లో గరిష్ఠంగా ఇది 6.50 లక్షలకు చేరింది. అయితే నాటి నుంచి క్రమంగా తగ్గిపోయింది. 2016 నాటికి 26 శాతం క్షీణించగా, 2017లో మరో 16 శాతం పడిపోయింది. విద్యార్థులు అమెరికాకు బదులు కెనడా, ఆస్ట్రేలియాలను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.