స్వచ్ఛతే సేవను ప్రారంభించిన బల్దియా కార్యక్రమంలో అమల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళల భద్రత, గౌరవంతో పాటు ఆరోగ్యం తదితర అంశాలన్నీ పారిశుధ్యంతో ముడిపడి ఉన్నందున తమ ఇంటితో పాటు బస్తీలు, కాలనీలను పరిశుభ్రంగా ఉంచడంలో మహిళలు అగ్రభాగానా ఉండాలని ప్రముఖ సంఘ సేవకురాలు, స్వచ్ఛ భారత్ మిషన్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని అమల పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నేడు ప్రారంభమైన స్వచ్ఛతే సేవలో భాగంగా మియాపూర్ జనప్రియ వెస్ట్‌సిటీ కాలనీలో ‘ మన స్వచ్ఛ బస్తీ ’ కార్యక్రమానికి అమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరిచందన, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్ మేక రమేష్ తదితరులు పాల్గొన్న మన స్వచ్ఛ బస్తీ కార్యక్రమంలో అమల మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రత అనేది ప్రతిఒక్కరి నుండి ప్రారంభం కావాలని అన్నారు.
తమ ఇళ్లల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోలకే అందజేయాలని సూచించారు. వీధుల్లో చెత్త వేయవద్దని హరితహారంలో భాగంగా మొక్కలను విస్తృతంగా నాటాలని పేర్కొన్నారు. వీధికుక్కలను దత్తతనిచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రారంభించిన మా ఇంటి నేస్తం కార్యక్రమాన్ని అమల ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
జోనల్ కమీషనర్ హరిచందన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2018లో హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు జీహెచ్ఎంసీ చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలకు నగర ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్వచ్ఛ కార్యక్రమాలలో అక్కినేని అమల, అరికెపూడి గాంధీలతో పాటు పలువురు పాల్గొన్నారు. మూడు వీధి కుక్కపిల్లలను మా ఇంటి నేస్తంలో భాగంగా దత్తతను అమల చేతుల మీదుగా స్థానికులకు అందజేశారు. మన స్వచ్ఛ బస్తీ అంశంపై పెయింటింగ్‌ను అమల వేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమీషనర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.