జాతరలో రూ. 3.68 కోట్ల మందు పొట్టల్లోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

జాతరలో రూ. 3.68 కోట్ల మందు పొట్టల్లోకి..

February 6, 2018

తాగుబోతులు తమ తప్పతాగే సిద్ధాంతాన్ని  దైవ సన్నిధిలో కూడా కొనసాగించి ఎక్సైజ్ శాఖను విస్మయానికి గురి చేశారు. మేడారం జాతరలో రూ. 3.68 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని వరంగల్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సురేశ్‌ రాథోడ్‌ తెలిపారు. మొక్కులు మొక్కులే.. మద్యం మద్యమే అన్నట్టు కొనసాగిందంటున్నారు.

‘వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో గుడుంబా నిర్మూలన పూర్తిగా అదుపులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుడుంబా తయారీ, రవాణా కాకుండా చర్యలు తీసుకున్నాం. ఎక్సైజ్ శాఖ, ఇతర ప్రభుత్వ అధికారుల సహకారంతో చాలా వరకు ఈ గుడుంబా దందాను అరికట్టాం. వారికి ఇతర ఉపాధి మార్గాలు చూపడమే కాకుండా వారి మీద నిఘా కూడా ఏర్పాటు చేశాం.

చాలా మంది ఆ పని మానుకున్నారు. పటిక, బెల్లం విక్రయాలపై నిఘా వుంచాం. ఎవరైనా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవు. ఎవరైనా ఇలాంటి పనులకు తెగబడితే టోల్‌ఫ్రీ నంబర్‌ 18004252523 కు సమాచారం ఇవ్వవచ్చని ప్రకటించాం.

ఈ కాల్ నేరుగా ఉన్నతాధికారలకు వెళుతుంది. అక్కడి నుండి ఈ మెయిల్ ద్వారా అధికారులకు సమాచారం చేరవేస్తాం. గుడుంబా తయారీ, విక్రయదారులపై అవసరమైతే పీడీ యాక్టును కూడా ఉపయోగిస్తాం ’ అని హెచ్చరించారు. ‘ ఇన్ని కట్టుబాట్లు విధించినా రికార్డు మొత్తంలో మద్యం ఎలా అమ్ముడు పోయిందనే ’ వాదనలు వినిపిస్తున్నాయి.