కొడుకు 10 పాస్ కావాలని 700 మందికి  విందు - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు 10 పాస్ కావాలని 700 మందికి  విందు

March 15, 2018

పుత్రోత్సాహం తండ్రికి  పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా ఆ పుత్రుని గనిగొని పొగుడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర అనే సుమతీ శతకం వినే ఉంటారు. ఈ తండ్రి కూడా తన కొడుకు గొప్ప స్థాయికి వెళ్లాలని కలలు కన్నాడు. అందరూ తన కొడుకును పొగుడుతుంటే పుత్రోత్సాహంతో  ఆనందపడుదామనుకున్నాడు. తన జీవితంలో పొందని ఆనందాలను, ఆశయాలను కొడుకుకు అందేలా చేయాలనుకున్నాడు. కొడుకు పదో తరగతి పాస్ కావాలని పత్రికలు కొట్టించి మరి 700 మందిని ఇంటికి ఆహ్వానించి వారికి విందు భోజనం పెట్టాడు.ఏమిటీ కొడుకు పది పాస్ కావాలని పత్రికలు కొట్టించి మరీ భోజనాలా? అని దీర్ఘాలు తీయకండి. ఎందుకంటే అతను అలా చేయడానికి  కారణం ఉంది. ఇంతకి అతనెవరు ఎందుకు అలా చేశాడో తెలుసుకుందాం.

అతని పేరు రజబ్ అలీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అలీ ఓ నిరుపేద రైతు. చిన్నప్పుడు చదువుకుని గొప్పవాడు కావాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ అతని కుటుంబం పెద్దది కావడంతో  కుటుంబపోషణ అలీ తండ్రికి భారమైంది. అందుకే కుటుంబానికి తను కూడా ఆసరా కావాలని అలీ మూడో తరగతిలోనే చదువును అటకెక్కించాడు. పదేళ్ల వయసులో తండ్రితో కలిసి పొలం పనులకు వెళ్లేవాడు. అతని కుటుంబంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చదువుకోలేదు. కాలక్రమేనా అతనికి పెళ్లై  కొడుకు పుట్టాడు. తాను సాధించాలనుకున్నవన్ని తన కొడుకు సాధించాలని కోరుకున్నాడు అలీ. అందుకే కొడుకు రాసే 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావాలని గ్రామంలోని అందరి దీవెనలు కావాలని చెప్పాడు. అందరికీ పత్రికలు పంచి మా ఇంటికి భోజనానికి వచ్చి  మా కొడుకును ఆశీర్వదించాలని కోరాడు. ఇంకో విషయం ఏంటంటే ఇలా వారికి విందు ఇవ్వడానికి అలీ తను ఓ సంవత్సరంగా డబ్బును కూడబెట్టాడట.

అతిథులంతా వచ్చి భోజనం చేసి  అలీ కొడుకును ఆశీర్వదించారు. మీ దీవెనలతో నా కొడుకు పదో తరగతి పాసవ్వాలి అని కోరుకున్నాడు అలీ. ఇలా పత్రికలు కొట్టడం, భొజనాలు పెట్టడం ఏంటని కొందరు అలీకి పిచ్చి పట్టింది అనుకున్నారు.  ఎవరేమనకున్నా సరే అలీ తను జీవితంలో పొందలేని ఆనందాలను కొడుకుకు ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఎంత కష్టమైనా సరే కొడుకును పైచదువులు చదివించి ప్రయోజకున్ని చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు అలీ.

ఎందుకంటే  అలీ చదువుకోక పోయినా కూడా  అతనికి చదువు విలువ తెలుసు. తన కుటుంబంలో ఎవ్వరూ పెద్దగా చదువుకోలేదు..ఇప్పుడు కొడుకు పదో తరగతి చదవుతున్నాడు అనగానే  అందుకే అలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అలీ కలలుకన్న ఆశయాలను అతని కొడుకు నెరవేర్చాలని కోరుకుందాం.