చనిపోతూ తన ఆస్తినంతా హీరో పేరుపై రాసింది - MicTv.in - Telugu News
mictv telugu

చనిపోతూ తన ఆస్తినంతా హీరో పేరుపై రాసింది

March 7, 2018

అభిమానులు హీరోల కోసం రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు గుళ్లు కడతారు.. ఇంకొందరు వారి పేరిట ప్రజాసేవ వంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఓ అభిమాని అందరికీ భిన్నంగా పోతూ పోతూ తన యావదాస్తిని తన అభిమాన హీరో పేరిట రాసి వెళ్ళిపోయింది. ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన ముంబైలో జరిగింది. ఆ అభిమాని పేరు నిషి త్రిపాఠి (62), ఆమె అభిమానించే హీరో సంజయ్ దత్. జనవరి 15న నిషి త్రిపాఠి అనారోగ్యంతో కన్నుమూసింది. తను చనిపోతూ తన ఆస్తినంతా సంజయ్‌దత్ పేరిట రాసిందట. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని బట్టబయలు చేసేవరకు కుటుంబ సభ్యులకు తెలియదు. నిషికి 80 సంవ‌త్స‌రాల త‌ల్లితో పాటు తోబుట్టువులు మ‌ధు, అరుణ్‌, ఆశిష్‌  ఉన్నారు. మ‌ల్బార్ ప్రాంతంలోని త్రివేణి అపార్ట్‌మెంట్స్‌లోని ట్రిపుల్ బ్రెడ్‌రూంలో వీరు నివ‌సిస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్ ధ‌ర పది కోట్ల‌కి పైనే ఉంద‌ని తెలుస్తోంది.ఆమె చనిపోయిన పక్షం రోజుల తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు సంజయ్‌దత్‌కు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్నాక సంజయ్‌దత్ ఆశ్చర్యానికి లోనయ్యాడట. వెంటనే దీనిపై సంజయ్‌దత్ స్పందించారు. ‘ నిషి ఎవరో నాకు తెలియదు. అభిమానులు తమ పిల్లలకు మా పేర్లు పెట్టుకోవటం సహజమే. కొందరు కానుకలు ఇస్తుంటారు. కానీ ఇలా తన పేరిట ఆస్తి రాయటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ఆస్తి మొత్తం ఆమె కుటుంబ సభ్యులకే చెందేలా నావంతు సహాయం చేస్తాను ’ అని పేర్కొన్నాడు సంజయ్‌దత్.