అనిల్ అంబానీ చేతికి ఎయిరిండియా! - MicTv.in - Telugu News
mictv telugu

అనిల్ అంబానీ చేతికి ఎయిరిండియా!

April 13, 2018

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ  ఎయిరిండియా నష్టాలతో మూతపడే స్థితిలోకి వచ్చింది. దాన్ని కొనుగోలు చేసేందుకు  గల్ఫ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎతిహాద్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. 2007లో జెట్ ఎయిర్ వేస్‌లో 26 శాతం వాటాలను ఎతిహాద్ కొనుక్కుంది. భారతీయ కుబేరుడు అనిల్ అంబానీతో కలసి ఎయిరిండియాను కొనడానికి యత్నిస్తోంది.ఎయిరిండియాలో భారత ప్రభుత్వం  విక్రయానికి ఉంచిన 76 శాతం వాటాలను పొందాలని భావిస్తోంది ఎతిహాద్. అయితే ప్రభుత్వం విధించిన ఓ షరతు వల్ల  తామే అంతా కొనుక్కోకుండా ధీరుబాయి అంబానీ గ్రూప్‌తో కలసి కొనాలని యోచిస్తోంది. అనిల్ అంబానీతో చర్చలు జరుపుతోంది. ఎయిరిండియా అనుబంధ సంస్థ గ్రౌండ్ హ్యాండ్లింగ్ జాయింట్ వెంచర్ ఏఐఎస్ఏటీఎస్‌లో 50 శాతం వాటాతో పాటు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాలను విక్రయించాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. విక్రయం తరువాత కీలక పోస్టులు, సంస్థ నిర్వహణ భారతీయుల చేతుల్లోనే వుండాలని షరతు విధించింది. దీంతో ఎతిహాద్ అనిల్ అంబానీతో మంతనాలు కొనసాగిస్తోంది.

ప్రస్తుతానికి అడాగ్, ఎతిహాద్‌ల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, అనిల్ అంబానీ ఆసక్తి చూపితే, ఎయిరిండియా కొనుగోలుకు అవసరమైన నిధులను అందించేందుకు ఎతిహాద్ సిద్ధమని తెలుస్తోంది. బ్రిటీష్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్ లైన్స్ తదితర సంస్థలు కూడా ఎయిరిండియాపై ఆసక్తిని చూపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అనిల్ అంబానీ, ఎతిహాద్‌ల మధ్య డీల్ కుదిరితే, రెండో భారత ఏవియేషన్ కంపెనీలో ఎతిహాద్ పెట్టుబడులు పెట్టినట్లవుతుంది. భారత విమానయాన రంగంలోకి విదేశీ సంస్థలు ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నాయనడానికి ఈ పరిణామాలు నిదర్శనమని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు.