అంబేద్కర్ విగ్రహాన్నీ ధ్వంసం చేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

అంబేద్కర్ విగ్రహాన్నీ ధ్వంసం చేశారు..

March 7, 2018

రాజకీయ విభేదాల సాకుతో కొన్ని శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేసి ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి. మొన్న త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చి వేశారు. ఆ ఘటన గురించి మరువక ముందే నిన్న తమిళనాడులోని వేలూరు సహా కొన్ని జిల్లాల్లో పెరియార్‌ విగ్రహాలను కూల్చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయమై విగ్రహాల కూల్చేవేత ఆపాలని హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు విధ్వంస కాండను ఆపటం లేదు.  తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా మనావాలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై దళితులు ఆందోళన చేపట్టారు. ‘మా మనోభావాలు దెబ్బ తిన్నాయి.. రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తారా.. ’ అని రహదారులపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదిలా వుండగా పశ్చిమ బెంగాల్లో సైతం భారతీయ జనసంఘ్‌ స్థాపకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు.