విద్యారంగంలో తనదైన ముద్రవేసిన గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూర్తితో పాటు మరో ముగ్గురు కూడా మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. అలస్కాలోని ఆంకరేజ్ సిటీలో వారు వెళ్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో వున్న మరొకరు కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. మాదం జరిగిన సమయంలో మూర్తి బృందం ప్రయాణిస్తున్న కారు గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న గీతం యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించించేందుకు ఎంవీవీఎస్ మూర్తి అమెరికా వెళ్లారు. ప్రమాద వార్త తెలుసుకున్న తానా సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన శాసనమండలి సభ్యుడిగా, ఎమ్మెల్సీగా వున్నారు.
ఎంవీవీఎస్ మూర్తి కన్నుమూతపై పలువురు రాజకీయ, విద్యారంగ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఎంవీవీఎస్ పూర్తి పేరు.. మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి. ఆయన 1939 జులై 3న జన్మించారు. మూర్తి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఐనవల్లి మండలంలోని మూలపాలెం గ్రామం. 1991, 1999లో రెండుసార్లు విశాఖ ఎంపీగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన మూర్తి విద్యారంగంలోనూ విశేషసేవలందించారు. ఆయన గోల్డ్‌స్పాట్ మూర్తిగా ప్రసిద్ధులయ్యారు.