అమెరికాలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. టెక్సాస్ ప్రాంతం అతాలకుతలమవుతోంది. వరదల భీభత్సంలో దాదాపు 13 లక్షల మంది చిక్కుకుపోయారు. ఈ వరదల్లో హ్యూస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 200 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిని అక్కడి అధికారులు కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ వరదల్లో నిఖిల్ భాటియా, షాలిని అనే విద్యార్థులు కొట్టుకుపోతుండగా కాపాడి అత్యవసర వైద్య సేవల విభాగంలో చేర్చారు. నిఖిల్ భాటియా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. షాలిని పరిస్థితికి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.
అతని మరణ వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన భాటియా పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. మరోపక్క.. వరద బాధితుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ తుఫానుతో టెక్సాస్ లో జనజీవనం అల్లకల్లోలమవుతోంది. ఈ తుఫాను ఇంకా రెండు మూడు రోజుల వరకు కొనసాగే అవకాశం వున్నట్టు అక్కడి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.