అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలిపై పౌడర్ దాడి జరిగింది. తన ఇంటికి వచ్చిన ఓ కవర్‌ను ఓపెన్ చేయగా అందులోంచి పౌడర్ ఆమెపై రాలిపడింది. దాంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ కొడుకు జూనియర్ ట్రంప్ ఇంటికి సోమవారం ఓ కవర్ వచ్చింది. దాన్ని ఆయన భార్య వానెస్సా తెరిచింది. పౌడర్ ఆమెపై పడిపోయింది. దీంతో ఆమెకు విపరీతమైన దగ్గు, తలతిరగడం వంటి లక్షణాల కనిపించాయి. వెంటనే నంబర్ 911కు ఫోన్ చేశారు. పోలీసులు ఆమెతో పాటుగా మరో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అది మాములు పౌడరే అని నిర్ధారించారు. మోడల్ అయిన వానెస్సా, జూనియర్ ట్రంప్ దంపతులకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. తన భార్య,పిల్లలు క్షేమంగా ఉన్నట్లు జూనియర్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు అమెరికా రహస్య నిఘా విభాగం, ఎఫ్‌బీఐలు రంగంలోకి దిగాయి. రెండేళ్ల క్రితం ట్రంప్ మరో తనయుడు ఎరిక్‌కు కూడా ఇలాంటి పార్సల్ ఒకటి వచ్చి కలకలం రేపింది. 2001లో ఇలాగే ఆంత్రాక్స్ పౌడర్‌ను పార్సల్ పంపి పలువురు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. యూఎస్ సెనేటర్లకు, వార్తా సంస్థలకు పార్సిళ్లను పంపటంతో ఐదుగురు మృతి చెందారు.