సామాన్లు కాదు, శవాలు.. తాగుబోతు నిర్వాకం - MicTv.in - Telugu News
mictv telugu

సామాన్లు కాదు, శవాలు.. తాగుబోతు నిర్వాకం

December 7, 2018

పాపం అనాథ శవాలు. .అనాథలు బతికున్నప్పుడు ఎందరో ఈసడింపులకు గురై, చనిపోయాక కూడా నిర్లక్ష్యానికే గురి అవుతారని చెప్పే ఘటన ఇది. ఓ తాగుబోతు ఇద్దరు అనాథ శవాలను రిక్షాలో స్మశానానికి తీసుకుపోతున్నాడు. మధ్యలో అతనికి వైన్ షాపు కనిపించింది. అంతే రిక్షాలో శవాలున్నయన్న విషయాన్ని మరిచి, రిక్షాను అక్కడ వదిలేసి ఫూటుగా మద్యం కొట్టి అక్కడే పడిపోయాడు. ఆ దారి గుండా పోయేవాళ్ళంతా రిక్షాలో శవాలున్నాయని బెదిరిపోయారు. హృదయవిదారకమైన ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది.

కావలి పరసర ప్రాంతాల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు. ఆ అనాథ శవాలకు కావలి ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించా రు. అనాథ శవాలు కావడంతో స్థానిక తహసీల్దారు కార్యాలయం సిబ్బం ది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. రెండు శవాలను స్మశానానికి తరలించడానికి ఓ రిక్షాను మాట్లాడారు. అతను రెండు శవాలను రిక్షాలో వేసుకుని శ్మశానం వైపు బయలుదేరి వెళ్ళాడు.

కాగా అతనికి మధ్యలో మద్యం షాపు కనిపించింది. వెంటనే అతను రిక్షా ఆపి మద్యం తాగేసి అక్కడే పడిపోయాడు. సుమారు 2 గంటల పాటు ట్రంకురోడ్డు పక్కనే మద్యం మత్తులో నిద్రించాడు. ఆ రోడ్డుగుండా వెళ్లే స్థానికులు రిక్షాలో శవాల నుంచి దుర్గంధం రావడంతో భయాందోళనలకు గురయ్యారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న రిక్షా కార్మికుడు అప్పుడు మృతదేహాలను స్మశానవాటికకు తరలించాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.