భారత్ మరో రికార్డ్.. అతిపెద్ద క్రికెట్ స్టేడియం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కేంద్రం మరో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించడానికి సిద్ధమవుతోంది. గుజరాత్‌ రాష్ట్రానికి ఇది మరో మణిహారం కానుంది. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని మొతేరాలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. లక్ష మంది కూర్చునే సామర్థ్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్దది.

ఆ రికార్డును తలదన్నే విధంగా ఈ స్టేడియంను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వాని ఆదివారం ట్వీట్‌లో పంచుకున్నారు. ఇది గుజరాత్ క్రికెట్ బోర్డు డ్రీమ్ ప్రాజెక్ట్ అని ట్వీట్‌లో తెలిపారు. ఈ స్టేడియం పూర్తయితే, దేశానికే తలమానికంగా నిలుస్తుందని చెప్పారు.

ఈ స్టేడియం ప్రత్యేకతలు..
      – స్టేడియం నిర్మాణానికి 2018 జనవరిలో శంకుస్థాపన జరిగింది.

            ఈ ప్రాజెక్ట్ ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఆలోచన.

  • ఈ స్టేడియాన్ని ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ పాపులస్ డిజైన్ చేసింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది.
  • మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంను కూడా పాపులస్ సంస్థే డిజైన్ చేసింది.
  • గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం నిర్మాణం పూర్తవుతోంది.
  • పాత మొతేరా స్టేడియంలో కేవలం 54వేల మంది కూర్చునే సామర్థ్యం మాత్రమే ఉండేది. పున:నిర్మాణంలో భాగంగా దీన్ని 2016లో కూల్చేశారు.
  • మొత్తం 63 ఎకరాల స్థలంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.
  • ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. మెల్‌బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు.
  • స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు రూ.700 కోట్లు.
  • స్టేడియంలో మొత్తం నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు ఉంటాయి. 50 గదులతో క్లబ్ హౌస్ ఉంటుంది. 76 కార్పోరేట్ బాక్సులు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటాయి.
  • స్టేడియంలో మూడువేల కార్లు, పదివేల మోటార్ సైకిళ్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది.
  • దీనిలో ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది.
Telugu news Another feather in the cap! Gujarat set to get world’s largest cricket stadium soon