బ్యాంకులను భారీగా ముంచుట్ల ఇదివరకు మనదేశంల ఒక్కడే తీస్మార్కాన్ ఉండె..ఆయనెవరో తెల్సే కదా అవును విజయ్ మాల్యానే. కానీ ఇప్పుడు ఇంకో విజయ్ మాల్యా తయారైండు. అతని పేరు నీరవ్ మోదీ. ముంబైలో పెద్ద వజ్రాల వ్యాపారి. పంజాబ్ నేషనల్ బ్యాంకులు పంగనామం పెట్టి మంచిగ స్విట్జర్లాండ్ పారిపోయిండు.ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11 వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్ మోదీపై పంజాబ్ నేషన్ బ్యాంక్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కానీ అతనేమో అంతకంటే ముందే విదేశాలకు ఎగిరిపోయాడు. దీనితో ముంబైలోని నీరవ్ మోదీ దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నారనే ఆరోపణలతో 10 మంది బ్యాంకు ఉద్యోగులను కూడా బ్యాంకువాళ్లు బుధవారం సస్పెండ్ చేశారు. .
ఒక్క పీఎన్ బీ బ్యాంకే కాదు నీరవ్ మోదీ సొక్కమైన వ్యక్తి అని నమ్మి ఇంకో రెండు మూడు బ్యాంకులు కూడా అతనికి అప్పులు ఇచ్చాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో బయటపడ్డ కుంభకోణంతో వాళ్లు కూడా లబోదిబో మంటున్నారు. ఇక భారీ కుంభకోణం నేపథ్యంలో పీఎన్బీ బ్యాంకు షేరు రెండు రోజుల్లో దాదాపు 17 శాతం నష్టపోయింది. ప్రముఖ జువెల్లరీ కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి. మరి ఇలా వరుసగా బ్యాంకులను మోసం చేసే మాల్యాలు పెరిగిపోకముందే బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు.