హైదరాబాద్‌లో బుల్లి నీరవ్ మోదీ! - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో బుల్లి నీరవ్ మోదీ!

February 23, 2018

బ్యాంకులను ముంచిన  విజయ్ మాల్యా, నీరవ్ మోదీల గురించే  రోజూ మనం మాట్లాడుకుంటున్నాం కానీ..మన దగ్గర కూడా అంతకంటే  పెద్ద దార్కారీలే ఉన్నరు. వారెవ్వ..  వీడు చేసిన మోసం తెలిస్తే..వీడి తెలివికి  పద్మశ్రీ ఇచ్చినా తక్కోనే. పేరు రంగారెడ్డి ..ఊరు నల్గొండ జిల్లా తెలుగుపల్లి.  హైదరాబాద్‌లో ఉంటూ బ్యాంకులను మాయ చేశాడు.

కంపెనీ లేదు.. కానీ ఉన్నట్లు నమ్మించాడు. ఉద్యోగులు లేరు..కానీ 41 మంది ఉన్నట్లు నమ్మించి వారి పేర్లపై 4 బ్యాంకుల్లో ఏకంగా 125  క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. కర్మన్ ఘాట్‌లో హార్డ్‌వేర్ షాపు పెట్టుకున్న రంగారెడ్డి.. సంపాదన సరిపోక తనకున్న తెలివితో అడ్డదారిలో సంపాదించాలనుకున్నాడు. తన కూతురు పేరుపై పర్ణిక నానో స్టిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని ఉత్తుత్తగా సృష్టించాడు. తన బంధువులు ఒకలిద్దరికి తన ప్లాన్ చెప్పి కంపెనీలో చాలామంది ఉద్యోగులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు.  జీహెచ్ఎంసీలో పనిచేసే కొందరికి డబ్బు ఆశచూపి 41 మంది ఓటర్ ఐడీ కార్డులు సంపాదించాడు. ఆ తర్వాత వారికి సంబంధించిన పాన్‌కార్డులను కూడా సంపాదించాడు. 41 మంది పేర్లపై బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాడు.

ఉద్యోగుల ఖాతాల్లో నెల నెల జీతాలు వేసేవాడు. ఆ తర్వాత  ఏటీయంల ద్వారా డబ్బులు డ్రా చేసేవాడు. దీనితో బ్యాంకులు అవి నిజమైన ఖాతాలే అని నమ్మి క్రెడిట్ కార్డులు ఇచ్చేవి. అలా నాలుగు బ్యాంకుల్లో 125 క్రెడిట్ కార్డులు తీసుకుని  బ్యాంకులకు ఏకంగా1 కోటీ 50 లక్షల రూపాయల పంగనామం పెట్టాడు. ఆ తర్వాత అజ్ఘాతంలోకి వెళ్లిపోయాడు. తీరా  బ్యాంకులు ఆరా తీస్తే.. అతనికి కంపెనీ లేదు, ఉద్యోగులు లేరు, అంతా ఒక్కడు చేసిన మోసమే అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా వేసిన పోలీసులు రంగారెడ్డితో సహా.. ఈ మోసానికి సంబంధించిన మొత్తం పదిమందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.6,90,000 స్వాధీనం చేసుకున్నారు. ఎంత తెలివి ఉన్నా ఏం లాభం. అడ్డదారుల్లో సంపాదించాలనుకుని చివరకు చిప్పకూడే గతి అయ్యింది రంగారెడ్డికి.